కలెక్టర్లతో మాట్లాడిన మంత్రి తుమ్మల

కలెక్టర్లతో మాట్లాడిన మంత్రి తుమ్మల
ఉమ్మడి ఖమ్మం బ్యూరో, ఆంధ్రప్రభ : మొoథా తుఫాన్ ప్రభావంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఈ రోజు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) సూచించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పత్తి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. చేతికి అందే దశలో పత్తి తడిచి నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లలో ఉన్న పత్తిని తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వరి కోతలు వాయిదా వేసుకోవాలని తెలిపారు.
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం (Khammam, Bhadradri Kothagudem) జిల్లాల్లో తుఫాన్ వల్ల నష్ట పోయిన పత్తి, వరి, ఉద్యాన పంటలకు జరిగిన నష్టంపై వ్యవసాయ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రెండు జిల్లా కలెక్టర్లతో ఆయన మాట్లాడారు. సీసీఐ కేంద్రాల్లో మార్కెట్ యార్డ్స్ లో ఉన్న పత్తి తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మార్కెటింగ్ అధికారులను అప్రమత్తం చేశారు.
ఖమ్మం (Khammam) నగరంలో లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు నిలవకుండా మున్సిపల్ సిబ్బంది అలర్ట్ గా ఉండాలని మున్సిపల్ కమిషనర్ కు మంత్రి సూచించారు. వర్షాలు తగ్గాక పూర్తి స్థాయిలో పంట నష్టం వివరాలు అందాక ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందని మంత్రి తుమ్మల వెల్లడించారు.
