సచివాలయంలోనే సీఎం చంద్రబాబు..

మొంథా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంబడి దాదాపు 90-110 కి. మీ వేగంతో తుఫాన్ పయనిస్తుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుఫాన్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మంగళవారం (అక్టోబర్ 28) రాత్రి సచివాలయంలోనే ఉంటూ తుఫాన్ సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆయన నిర్ణయించారు.

మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలతో నిరంతరంగా సమీక్ష నిర్వహిస్తూ ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. తుఫాన్ ముప్పు నుంచి ప్రజలను రక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని, ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా, ఆస్తి నష్టం తగ్గేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

లంక గ్రామాల ప్రజలను వెంటనే పునరావాస శిబిరాలకు తరలించాలని ఆదేశించారు. కాల్వలు, చెరువులు గండిపడకుండా పర్యవేక్షించాలన్నారు. ప్రతి గంటకు తుఫాన్ బులెటిన్లు విడుదల చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా విజయవాడ, ఏలూరు, భీమవరంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

ప్రజలకు నిజమైన సమాచారం అందించాలన్న ముఖ్యమంత్రి, తప్పుడు వార్తలు లేదా భయాందోళనలకు అవకాశం ఇవ్వొద్దని అధికారులను హెచ్చరించారు.

వాతావరణశాఖ రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.

అదే విధంగా రాయలసీమలోని నంద్యాల, కర్నూలు, శ్రీ సత్యసాయి, అనంతపురం, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.

తుఫాన్ ప్రభావంతో తీర ప్రాంతంలోని ప‌లు గ్రామాలు చీకటిలో మునిగిపోయాయి. రాబోయే 8–10 గంటల్లో ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో గంటకు 110 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, 10–20 సెం.మీ వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

Leave a Reply