కలెక్టర్ చేతుల మీదుగా సేవలు ప్రారంభం..
తిమ్మాపూర్, ఆంధ్రప్రభ : స్వాతంత్ర సమరయోధుల ట్రస్ట్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు సేవలు అందించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి(Pamela Satpati) అన్నారు. కరీంనగర్ జిల్లా స్వాతంత్ర సమరయోధుల ట్రస్ట్ ఆధ్వర్యంలో తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్లో నిర్వహిస్తున్న మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాల, వృత్తి విద్యా శిక్షణ కేంద్రానికి నూతన బస్సు ప్రారంభోత్సవం జరిగింది.
26 లక్షల రూపాయలతో శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్(Srinidhi Credit Cooperative Federation Limited) ఈ బస్సు ను అందజేసింది. ఈ సమావేశనికి హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి బస్సును ప్రారంభించి మానసిక విద్యార్థులకు కలిసి ప్రయాణించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ మానసిక వికలాంగుల పాఠశాలను, వృత్తి విద్యా కేంద్రాన్ని స్థాపించి ట్రస్ట్ సభ్యులు నిర్విరామంగా దశాబ్దాల పాటు సేవలు అందించడం అభినందనీయమని అన్నారు. దివ్యాంగుల మానసిక వికాసానికి కృషి చేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది సేవలను కొనియాడారు.
ట్రస్ట్ చైర్మన్(Trust Chairman), మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా స్వాతంత్ర సమరయోధుల ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మానసిక వికలాంగుల పాఠశాలలో 130 మంది విద్యార్థులు చదువుతున్నారని, 40 మంది ఉపాధి పొందుతున్నారని అన్నారు.

ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి 136 మందికి కంటి ఆపరేషన్లు చేయించామని తెలిపారు. ఈ సందర్భంగా మానసిక వికలాంగుల పాఠశాల విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ డీజీఎం సిహెచ్ వెంకట రెడ్డి, బోర్డు డైరెక్టర్ తిరుమల, ట్రస్ట్ వ్యవస్థాపకులు బి.వెంకటయ్య(B. Venkataiah), ఇతర ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.
తిమ్మాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శించిన జిల్లా కలెక్టర్..

తిమ్మాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. ఇక్కడ నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళ వైద్య పరీక్షలను గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య మహిళ, ఓపి రిజిస్టర్ ను పరిశీలించారు. గర్భిణీలకు 4 ఏ.ఎన్.సి వైద్య పరీక్షల పట్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
వారికి కచ్చితంగా నాలుగు ఏ. ఎన్. సి పరీక్షలు అయ్యేలా చూడాలని తెలిపారు. సాధారణ ప్రసవాల ప్రాధాన్యత పట్ల అవగాహన కల్పించాలని తెలిపారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్యాధికారి వెంకటరమణ(Venkataramana) ఉన్నారు.
దివ్యాంగులకు సహాయ ఉపకరణాల ఎంపిక శిబిరం పరిశీలన
ఎల్ఎండి కాలనీలోని దుర్గాబాయి దేశ్ముఖ్(Durgabai Deshmukh మహిళా శిశు వికాస కేంద్రంలో మహిళలు, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో అలింకో సహకారంతో నిర్వహించిన దివ్యాంగులకు, వయోవృద్ధులకు సహాయ ఉపకరణాల ఎంపిక శిబిరాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. శిబిరానికి హాజరైన వారి వివరాలు, వైద్య పరీక్షల వివరాలు పక్కాగా నమోదు చేయాలని అన్నారు.

