విజయవాడ దగాకోరులు అరెస్టు
విజయవాడ, క్రైమ్, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రభ : విజయవాడ(Vijayawada)లో కోట్లాది రూపాయల మోసం చేసిన ఆదిత్య ట్రేడింగ్ కంపెనీ కేసులో ప్రధాన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మొత్తం రూ. 140 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు పోలీసులు వెల్లడించారు. ఎన్టీఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు ఆదేశాల మేరకు, క్రైమ్ డీసీపీ డాక్టర్ కె. తిరుమలేశ్వర రెడ్డి(Dr. K. Tirumaleshwara Reddy) ఆధ్వర్యంలో సెంట్రల్ ఏసీపీ కె. దామోదర రావు, టాస్క్ ఫోర్స్ ఏసీపీ లత కుమారి బృందాలు సంయుక్తంగా దర్యాప్తు జరిపి నిందితులను అదుపులోకి తీసుకున్నాయి.
దర్యాప్తులో తేలిన వివరాల ప్రకారం, ప్రధాన నిందితుడు తాడేపల్లి వెంకట ఆదిత్య, అతని భార్య సుజాత కలిసి 2022లో ఆదిత్య ట్రేడింగ్ కంపెనీ(Aditya Trading Company) పేరుతో వ్యాపారం ప్రారంభించారు. నెలకు 5 శాతం వడ్డీ ఇస్తామన్న మోసపూరిత హామీలతో ప్రజల నుండి భారీ మొత్తంలో డిపాజిట్లు సేకరించారు. ట్రేడింగ్‌లో లాభాలు రాకపోవడంతో కొత్త డిపాజిటర్ల డబ్బులతో పాత వారికి వడ్డీ చెల్లిస్తూ వ్యవహరించారు.

ఇప్పటి వరకు మొత్తం 1450 మంది డిపాజిటర్ల నుండి సుమారు 400 కోట్లు సేకరించినట్లు, అందులో సుమారు 144 కోట్లు మోసపోయినట్లు విచారణలో తేలింది. ఆదిత్య(Aditya) తన పేరుతో, భార్య పేరుతో చిరాస్తులు , బంగారం కొనుగోలు చేసినట్లు, అలాగే కొంతమంది ఏజెంట్లు కూడా లాభాపేక్షతో ఈ మోసానికి సహకరించినట్లు పోలీసులు తెలిపారు.విజయవాడలో బల్లెం వారి వీధిలోని శ్రీలక్ష్మీ ఎంక్లేవ్ అపార్ట్మెంట్(Srilakshmi Enclave Apartment) వద్ద నిందితులు ఆదిత్య, సుజాతతో పాటు ఏజెంట్లు గాధంశెట్టి బాలకృష్ణమూర్తి, నాగలక్ష్మి కుమారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టు సందర్భంగా 23 లక్షల నగదు, 580 గ్రాముల బంగారం, 8.3 కిలోల వెండి వస్తువులు, టాటా సఫారి కారు, కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసు విచారణలో కృషి చేసిన సెంట్రల్ ఏసీపీ కె. దామోదర రావు, టాస్క్ ఫోర్స్ ఏసీపీ లత కుమారి, ఇన్‌స్పెక్టర్లు సుబ్రహ్మణ్యం, ప్రకాశ్, వాసిరెడ్డి శ్రీను, పవన్ కిశోర్, రాజశేఖర్, చవాన్, చంద్రశేఖర్, కిశోర్ బాబు లను కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు.

