ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడద్దు..
ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కడా ఎవరికీ ఇబ్బంది లేకుండా ప్రజా భద్రతే(Public safety) లక్ష్యంగా తుఫాను ప్రతిస్పందన చర్యలు తీసుకున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ తెలిపారు. విజయవాడ అర్బన్, గ్రామీణ ప్రాంతాలతో పాటు నందిగామ, తిరువూరు డివిజన్లలోనూ అన్ని సౌకర్యాలతో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
ఈ రోజు మొంథా తుపానుకు సంబంధించి క్షేత్రస్థాయి తనిఖీల్లో భాగంగా కలెక్టర్ లక్ష్మీశ(Collector Lakshmisha) విజయవాడ, విజయవాడ అర్బన్ పరిధిలోని విద్యాధరపురం జీఎన్ఆర్ స్కూల్‌లోని పునరావాస కేంద్రాన్ని తనిఖీ చేశారు. అప్పటికే ఈ కేంద్రంలో 23 మంది ఉండగా.. వారితో మాట్లాడి సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ అల్పాహారంతో పాటు భోజనం, తాగునీరు, వైద్య సేవలు(Medical Services).. ఇలా ప్రతి విషయంలో నాణ్యతకు ప్రాధాన్యమివ్వాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడొద్దని అధికారులకు సూచించారు. పారిశుద్ధ్యం పైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పునరావాస కేంద్రంలో టీవీTV) కూడా ఏర్పాటు చేయాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.

