తుఫాన్ రక్షణ.. ప్రత్యేక ప్రణాళిక..
(ఆంధ్రప్రభ – కృష్ణా ప్రతినిధి): తుఫాన్ తీరం దాటే వరకూ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కృష్ణా జిల్లా (Krishna District) పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ తెలిపారు. పెడన పట్టణంలో తుఫాన్ పునరావాస కేంద్రాలను సందర్శించి వసతులను పరిశీలించారు. అనంతరం లోతట్టు ప్రాంతాలను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలు అప్రమత్తతో ఉండాలని వ్యవసాయ అధికారులతో తుఫాన్ రక్షణ ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.
గంటకు 100 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్త చర్యలు (Precautionary measures) తప్పనిసరిగా తీసుకోవాలి అన్నారు. విద్యుత్ తీగలు, చెట్లు వద్దకు వెళ్లవద్దన్నారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ సూచించిన ప్రాంతాల్లో పరిశీలించి ముందస్తుగా చర్యలు చేపట్టాలన్నారు. ప్రజల రక్షణ, సహాయక చర్యలకు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉందన్నారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులు కాపాడటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు.

