ఆటో డ్రైవ‌ర్ల‌కు ఇచ్చిన హామీ నెర‌వేర్చాలి

ఆటో డ్రైవ‌ర్ల‌కు ఇచ్చిన హామీ నెర‌వేర్చాలి

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ రోజు బన్సీలాల్ పేట(Bansilal Peta) డివిజన్ లోని జబ్బార్ కాంప్లెక్స్ వద్ద ఆయన ఆటో నడిపి ఆటో డ్రైవర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు విన్నవించారు.

ఈ సందర్భంగా త‌ల‌సాని మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ చేతగాని హామీలు ఇచ్చి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల(Drivers) ను మోసం చేసిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో లక్షలాది మంది ఆటోలు నడుపుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 12 వేల రూపాయలు చొప్పున ఆర్థిక‌ సహాయం అందిస్తామని హామీ ఇచ్చి రెండేళ్లు అవుతున్నా నేటి వరకు ఇవ్వలేదని అన్నారు. రెండేళ్ల‌కు సంబంధించి 24 వేల రూపాయలను వెంటనే చెల్లించాలని డిమాండ్(demand) చేశారు.

ప్రభుత్వ వేధింపుల వ‌ల్ల‌ 161 మంది ఆటో డ్రైవర్లు మరణించారని త‌ల‌సాని ఆవేదన వ్యక్తం చేశారు. రోజు వారి ఆదాయం తగ్గి కుటుంబాలను పోషించే పరిస్థితి లేక ఇబ్బందుల్లో ఉండగా, ఇష్టానుసారంగా జరిమానాలను విధిస్తూ ఆటో డ్రైవర్లను ప్రభుత్వం వేధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్‌(KCR) నాయకత్వంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నారని గుర్తు చేశారు.

ఎలాగైనా అధికారంలోకి రావాలనే దురాలోచనతో కాంగ్రెస్ పార్టీ మహిళలకు రూ. 2500 ఆర్థిక సహాయం, పెన్షన్ ను 4 వేల రూపాయలకు పెంచుతామని అనేక హామీలు మేనిఫెస్టో(Manifesto) లో పెట్టి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి ఆటో డ్రైవర్ల కుటుంబాల ఉసురు తగులుతుంది అని హెచ్చరించారు. ఆటో డ్రైవర్ల సమస్యలపై లక్ష ఆటోలతో ప్రదర్శన చేయనున్నట్లు తెలిపారు.

బీఆర్ ఎస్ పార్టీ(BRS Party) ఆటో డ్రైవర్ల కు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కుర్మ హేమలత, పద్మారావు నగర్ బీఆర్ఎస్ ఇంచార్జీ గుర్రం పవన్ కుమార్ గౌడ్, బన్సీలాల్ పేట డివిజన్ అధ్యక్షుడు వెంకటేషన్ రాజు, నాయకులు ప్రేమ్, లక్ష్మీపతి, సురేష్, కుమార్ యాదవ్, అబ్బాస్, ఆటో యూనియన్ అధ్యక్షుడు విజయ్, సాయి తదితరులు ఉన్నారు.

Leave a Reply