కమాండ్ కంట్రోల్ రూమ్.. నిరంతర పర్యవేక్షణ…
ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : మొంథా తుఫాను నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తత ఉందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ(District Collector Lakshmisha) తెలిపారు. అన్ని శాఖల అధికారులతో పూర్తి సమన్వయంతో ముందస్తు చర్యలు తీసుకున్నామని చెప్పారు. తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్(NTR District Collectorate) కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
ఈ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తున్న కలెక్టర్ సోమవారం పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు జాయింట్ కలెక్టర్ ఇలాకియా, మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్రతో పాటు పలు శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ… తుఫాను ప్రభావం ఎన్టీఆర్ జిల్లా పై కూడా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నాం అన్నారు.
భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలోని విద్యాసంస్థలకు నేటి నుండి మూడు రోజుల పాటు సెలవు ప్రకటించామని, గ్రామస్థాయి నుంచి పట్టణాల వరకు తుఫాను(Cyclone) ప్రభావం ఉంటుందన్నారు. అన్ని నియోజకవర్గాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశామని, జిల్లాలో అనేక చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పాత భవనాలు, ఇళ్ళు గుర్తించామని, వారిని రక్షిత ప్రాంతాలకు వెళ్ళమని సూచించినట్లు తెలిపారు.
కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉన్న చోట్ల ఇళ్ళు అలాగే పాత భవనాల్లో నివాసం ఉంటున్న వారు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. పునరావాస కేంద్రాలను ప్రజలు వినియోగించుకోవాలన్నారు. అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశామని, సీఎంఓ(CMO) కార్యాలయంతో పాటు రాష్ట్ర అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారని, గంట గంటకు వాతావరణ సమాచారం, తుఫాను సమాచారం అందరికీ అందిస్తున్నట్లు తెలిపారు.
జిల్లా యంత్రాంగం(District Administration) ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తోందని, ఎటువంటి విపత్కర పరిస్థితులను అయినా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ప్రజలు అధికారులు ఇస్తున్న సూచనలను పాటిస్తూ సహకరించాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.

