కర్నూలు యాక్సిడెంట్ అసలు కథ
( కర్నూలు, ఆంధ్రప్రభ బ్యూరో ): చిన్నటేకూరులో వీ కావేరీ ట్రావెల్స్ ఘోర బస్సు ప్రమాదం వెనుక అసలు కారణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. శివశంకర్ అనే బైకర్ మద్యం తాగి వాహనం నడపడం, అతడి మృతదేహాన్ని పక్కకు జరిపి స్నేహితుడు ఫోన్ తీసుకెళ్లడం, ఆ ఫోన్ లో పోలీసులకు కీలక ఆధారాలు లభించడం వంటి అంశాలు ఈ ఘటనను మరింత సవివరంగా చూపిస్తున్నాయి..
ఫోనే కీలకాధారం
ప్రమాదం తర్వాత శివశంకర్ మృతదేహం పక్కన ఫోన్ లభించకపోవడంతో పోలీసులు సాంకేతిక ఆధారాలను వినియోగించారు. కాల్ డేటా, లొకేషన్ ట్రాకింగ్ ఆధారంగా ఆ ఫోన్ రాంపల్లి గ్రామం పరిధిలో ఉందని గుర్తించారు. విచారణలో ఆ మొబైల్ అతడి స్నేహితుడు ఎర్రిస్వామి వద్ద ఉన్నట్లు తేలింది. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నలు జరిపారు. ఆరా తీయగా వెలుగులోకి వచ్చిన నిజం విచారణలో ఎర్రిస్వామి ఆసక్తికర వివరాలు వెల్లడించాడు. తాము బైక్‌పై ప్రయాణిస్తుండగా ఒక వాహనం ఢీకొట్టిందని, దాంతో శివశంకర్ స్పాట్లోనే చనిపోయాడని తెలిపాడు. తన స్నేహితుడి బాడీని పక్కకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఫోన్ తన దగ్గరికి వచ్చిందని చెప్పాడు. అదే సమయంలో రోడ్డు మధ్యలో బైక్ పడిపోవడంతో, దానిపై బస్సు ఎక్కి ఈ ఘోర ప్రమాదం జరిగిందని పోలీసులకు వివరించాడు.
ఇద్దరి మధ్య వాదన
ఎర్రిస్వామి కర్నూలు జిల్లా ఉలిందకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసాడు. మృతుడు .. స్నేహితుడు శివశంకర్ నిర్లక్ష్యంగా బైక్ నడపడంతోనే ప్రమాదం జరిగిందని ఆరోపించాడు. అతడిపై కల్లూరు మండల పరిధిలోని ఉల్లిందకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు ఆర్ ఎఫ్ ఎస్ ఎల్ (ప్రాంతీయ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ) నివేదిక ప్రకారం, మృతుడు శివశంకర్ విస్సెరా నమూనాలో మద్యం తాగినట్టు స్పష్టమైంది. అతడు మద్యం తాగి వాహనం నడిపినట్లు తేలిందని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ప్రాథమిక నిర్లక్ష్యం బైకర్‌దే. మద్యం సేవించి వాహనం నడపడం ఈ ప్రమాదానికి ప్రధాన కారణం అని ఎస్పీ స్పష్టం చేశారు. ప్రమాద సమయంలో బస్సు డ్రైవర్ రోడ్డుపై పడిన బైకును గమనించకపోవడమే కాకుండా, దానిపైకి బస్సును పోనిచ్చినట్లు విచారణలో తేలింది. మంటలు చెలరేగగానే డ్రైవర్ భయపడి పారిపోయాడని, ప్రయాణికులకు సకాలంలో సమాచారం ఇవ్వకపోవడం వల్లే 19 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు పేర్కొన్నారు.
అంతులేని ఆవేదన
బస్సులో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలు ఇంకా తీవ్ర మానసిక స్థితిలో ఉన్నారు. ఎవరైనా ఆ బైకును రోడ్డుపై నుంచి తొలగించి ఉంటే మా వాళ్లు బతికేవారు. అని బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
కళ్లు తెరిపించిన నిర్లక్ష్యం
దురదృష్టకర విషయం ఏమిటంటే ప్రమాదానికి ముందు మరో మూడు బస్సులు అదే రహదారిలో ప్రయాణించాయి. అవి రోడ్డుపై పడిన బైకును చూసి పక్కనుంచి వెళ్లాయి, కానీ దానిని తొలగించలేదు. ఆ చిన్న ప్రయత్నం చేసి ఉంటే ఈ ప్రమాదం సంభవించేది కాదు. 19 మంది అమాయక ప్రాణాలు నిలిచి ఉండేవి.
కొనసాగుతున్న దర్యాప్తు
రవాణా, పోలీస్, ఫోరెన్సిక్ శాఖలు కలసి దర్యాప్తు చేపట్టాయి. ప్రతి నిమిషం చరిత్రను సాంకేతిక ఆధారాల ద్వారా రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు. బస్సు డ్రైవర్ స్థితిగతులు, ఫోన్ కాల్ వివరాలు, సీసీ కెమెరా ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఎర్రిస్వామిపై ఇంకా విచారణ కొనసాగుతోంది.శివశంకర్‌పై నిర్లక్ష్య రవాణా నిబంధనల కింద ఐపిసి సెక్షన్ 304-ఏ ప్రకారం కేసు నమోదైంది.బస్సు డ్రైవర్‌పై కూడా వేర్వేరు కోణాల్లో విచారణ కొనసాగుతోంది. అన్ని ఆధారాలు, నివేదికలు ఒకే దిశగా సూచిస్తున్నాయి. మద్యం సేవించి వాహనం నడపడం, బైక్ రోడ్డుపై పడిపోవడం, డ్రైవర్ గమనించకపోవడం,ఇవే కర్నూలు దుర్ఘటనకు మూలకారణాలు. కాగాచిన్న నిర్లక్ష్యం ఎంత పెద్ద నష్టానికి దారితీస్తుందో కర్నూలు దుర్ఘటన మరోసారి నిరూపించింది. ఒక బైక్ రోడ్డుపై పడిపోవడం, మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం, డ్రైవర్ సకాలంలో స్పందించకపోవడం , ఈ మూడు కారణాల కలయిక 19 ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటన ప్రతి డ్రైవర్, ప్రతి ప్రయాణికుడు ఒక పాఠంగా తీసుకోవాలి. రోడ్డుపై కనిపించే చిన్న అడ్డంకీ ప్రాణాంతకమవుతుందనే జాగ్రత్త ఎప్పటికీ మరిచిపోరాదు.

