తుపానుపై తిరుపతి కలెక్టర్ వార్నింగ్
ఆంధ్రప్రభ, తిరుపతి ప్రతినిధి : “మొంథా” తుఫాను ఫ్రభావంతో ఐదు రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురవనున్న తరుణంలో.. విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు తిరుపతి జిల్లా కలెక్లర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ అప్రమత్తం అయ్యారు. అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. స్వీయ పర్యవేక్షణకు ఆదివారం రంగంలోకి దిగారు. తిరుపతికలెక్టరేట్ లోని కంట్రోల్ రూమ్ ను ఆదివారం ఉదయం తనిఖీ చేశారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఇరిగేషన్, విద్యుత్, ఆర్ అండ్ బి ,పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఆర్టీసీ, మెడికల్ పోలీస్,అగ్నిమాపక శాఖ, రెవెన్యూ శాఖల అధికారులతో మాట్లాడారు. తుపాను పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ “మొంథా” తుపానును తేలికగా తీసుకోవద్దన్నారు. ఈ నెల 27, 28, 29 తేదీలలో ఇది మరింత తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపధ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. తుపాను సందర్బంగా ఎప్పటి కప్పుడు తలెత్తే పరిస్థితులపై ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ స్థంబాలు, తదితర పరికరాలను ముందుగానే సమకూర్చుకొని, విద్యుత్ అంతరాయాలు లేకుండా చూడాలన్నారు. విద్యుత్తు సిబ్బంది అందరూ తమ తమ ప్రాంతాలలో ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. క్షేత్ర స్థాయిలో సిబ్బందిని నియమించుకొని ఎప్పటికప్పుడు మేజర్ ప్రాజెక్ట్స్, మైనర్ ప్రాజెక్ట్స్, కెనాల్స్ ను తరచుగా నీటి మట్టాలను పరిశీలిస్తూ తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్, ఆర్అండ్ బి , పంచాయతీ రాజ్ శాఖల అధికారులను ఆదేశించారు. ఆర్ డబ్ల్యుఎస్ అధికారులు వర్షాభావ ప్రాంతాలలో సురక్షిత నీటిని అందించేలా త్రాగునీటి ట్యాంకర్ల ను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.
వర్షాల కారణంగా అన్ని రకాల అత్యవసర మందులను ముందుగా సిద్దం చేసుకోవాలన్నారు. కంట్రోల్ రూమ్ లోని రెవెన్యూ అధికారులు అన్ని శాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు. మొంథా తుపానును ఎదుర్కునేందుకు అన్ని రకాల సహాయక చర్యలు తీసుకునేందుకు, జిల్లాలోని ఆర్ డీఓ లు, తహసీల్దార్ లు, ఇతర లైన్ డిపార్టుమెంట్లు సమన్వయము చేసుకోవాలన్నారు. ముందస్తుగా జేసీబీ లు, క్రేన్ లు,తదితర సామగ్రిని అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఆర్టీసీ బస్సులు సాధారణంగా ప్రయాణించేప్రాంతంలో కాజ్ వే లు ,ఇతర లోతట్టుగా వున్న బ్రిడ్జ్ లపై నీళ్లు పొంగి ప్రవహిస్తున్నపుడు ప్రత్యామ్నాయ మార్గాలలో సురక్షితంగా ప్రయాణికులను చేరవేసేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు.

