సాఫ్ట్‌బాల్ క్రీడ విస్తరణకు కృషి
సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్
ఆమదాలవలస, అక్టోబర్ 26(ఆంధ్రప్రభ): ఆంధ్రప్రదేశ్‌లో సాఫ్ట్‌బాల్ క్రీడను గ్రామీణ, పాఠశాల స్థాయికి విస్తరించేందుకు కృషి చేస్తున్నామని సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, ఆముదాలవలస ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ తెలిపారు. అందులో భాగంగానే ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు రమేష్ మండోల్కర్ అధ్యక్షతన దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్ర సాఫ్ట్‌బాల్ సంఘాల ప్రతినిధులతో ఆదివారం జరిగిన జనరల్ బాడీ సమావేశంలో కూన రవికుమార్ పాల్గొన్నారు.
సమావేశంలో దేశవ్యాప్తంగా సాఫ్ట్‌బాల్ క్రీడ అభివృద్ధి, కొత్త ప్రతిభావంతుల ఎంపిక, జాతీయ స్థాయి పోటీలు నిర్వహణ, మహిళా క్రీడాకారిణులకు ప్రోత్సాహం, అంతర్జాతీయ స్థాయిలో భారత ప్రాతినిధ్యం వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది.
ఈ సందర్భంగా కూన రవికుమార్ మాట్లాడుతూ యువ క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదగేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, శిక్షణా శిబిరాలు, క్రీడా సామగ్రి అందించడానికి ప్రభుత్వం సహకారం అందిస్తోందని తెలిపారు. అలాగే, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్ నిర్వహించేందుకు ప్రతిపాదనను సమావేశం ముందు ఉంచారు. ఆయన సూచనలను సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సభ్యులు ప్రశంసించారు. సమావేశంలో దేశంలోని వివిధ రాష్ట్రాల సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులు, క్రీడా ప్రతినిధులు పాల్గొని క్రీడా అభివృద్ధిపై పలు నిర్ణయాలు తీసుకున్నారు.

