రైతుల అభివృద్ధే ప్రధాన లక్ష్యం

రైతుల అభివృద్ధే ప్రధాన లక్ష్యం
నారాయణపేట ప్రతినిధి, అక్టోబర్ 25 (ఆంధ్రప్రభ): దేశవ్యాప్తంగా వెనుకబడిన వంద జిల్లాలను ప్రధాన మంత్రి ధన ధాన్య యోజన పథకం కింద ఎంపిక చేయడం హర్షించదగ్గ విషయం అని హిమాచల్ ప్రదేశ్ మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఇందులో నారాయణపేట, నాగర్‌కర్నూల్, గద్వాల జిల్లాలు కూడా చోటు దక్కించుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. శనివారం ఆయన నారాయణపేటలో బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు రతంగ్ పాండు రెడ్డి షష్టిపూర్తి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు సత్య యాదవ్ గెస్ట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ.. వెనుకబడిన జిల్లాల్లో రైతుల ఉత్పత్తి జాతీయ సగటుతో పోలిస్తే 20 – 40 శాతం తక్కువగా ఉంది. రైతుల ఉత్పత్తి పెంపు కోసం ఈ జిల్లాలను కేంద్రం ప్రత్యేకంగా ఎంపిక చేసిందని, ప్రతి జిల్లాకు రూ.28 వేల కోట్ల నిధులు కేటాయించారు. దీని వలన ఎటువంటి నిధుల కొరత ఉండదు. ఈ నిధులను సక్రమంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. 35 కేంద్ర పథకాలు అమలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. కేంద్రం ఇచ్చే నిధులకు రాష్ట్రం ఇచ్చే వాటాను సమయానికి విడుదల చేస్తేనే కేంద్ర నిధులు సమర్థంగా వినియోగం అవుతాయి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సమైక్య స్ఫూర్తితో కలిసి పని చేయాలి అని సూచించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన జీఎస్టీ సంస్కరణలు వినియోగదారుల పై భారం తగ్గించాయని చెప్పారు. వ్యవసాయ యంత్రాలు, ట్రాక్టర్ల పై జీఎస్టీని 12 శాతం నుండి 5 శాతానికి తగ్గించడం రైతులకు ఉపశమనం కలిగిందన్నారు. గ్రామీణ వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం, సోలార్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా ఉత్పాదకతను పెంచడమే లక్ష్యంమని పేర్కొన్నారు. అలాగే వెనుకబడిన జిల్లాల్లో విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో అభివృద్ధి కల్పించేందుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ జిల్లాల పురోగతికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు నాగురావ్ నామాజీ, జిల్లా అధ్యక్షుడు సత్య యాదవ్, పార్టీ నాయకులు కొండయ్య తదితరులు పాల్గొన్నారు.
