వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర

హరే కృష్ణ కల్చరల్ సెంటర్ నిర్మాణ పనుల పరిశీలన

ఉమ్మడి మెదక్ బ్యూరో, ఆంధ్ర ప్రభ : అక్షయ పాత్ర సేవలు స్ఫూర్తిదాయకమని రాష్ట్ర, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా కంది మండలంలో హరే కృష్ణ మూవ్‌మెంట్ ఆధ్వ‌ర్యంలో ప్రతిష్ట్మాకంగా నిర్మిస్తున్న హరే కృష్ణ కల్చరల్ సెంటర్ నిర్మాణం పనులను శనివారం ఆయన పరిశీలించారు. అనంతరం మహా న‌ర్సింహ‌ హోమం, గర్భాలయ యంత్ర స్థాపన పూజ కార్యక్రమము లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆధ్వ‌ర్యంలో మూడు కొత్త ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ వాహనాలను జెండా ఊపి మంత్రి దామోదర్ రాజనర్సింహ, టీజీఐసీసీ చైర్‌ప‌ర్స‌న్‌ నిర్మలాజగ్గారెడ్డి తో కలసి ప్రారంభించారు . అనంతరం అక్షయ పాత్ర ఫౌండేషన్ నిర్వహిస్తున్న అతిపెద్ద కిచెన్ ను పరిశీలించారు . ఆధునిక వంట గదులను , స్నాక్స్ ,ఆటోమేటిక్ కూరగాయల వాషింగ్ , కటింగ్ మెషిన్ లను పరిశీలించారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ హరే కృష్ణ కల్చరల్ సెంటర్‌లో రాధాకృష్ణ విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు నిర్వహించిన మహా న‌ర్సింహ హోమం, గర్భాలయ యంత్ర స్థాపన పూజలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. సనాతన ధర్మ మహోన్నత సంస్కృతిక వారసత్వాన్ని, విలువలను ప్రాచుర్యంలోకి తేవటానికి అద్భుత అధ్యాత్మిక సంస్కృతి కేంద్రంగా ఇది నిలుస్తుందని వెల్లడించారు .

అక్షయ పాత్ర ఫౌండేషన్ తో సుమారు 20 ఏళ్ల‌కు పైగా అనుబంధం ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి సహకారంతో కందిలో దేశం లోనే అతిపెద్ద కిచెన్ ను ఏర్పాటు చేశామన్నారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ వారు ఆకలితో బాధపడే వారందరికీ మంచి భోజనం అందించటమే లక్ష్యంగా రోజుకు 23 లక్షల మందికి పైగా మధ్యాహ్న భోజనాలను సరఫరా చేస్తున్నారన్నారు. ఇప్పటి వరకు భోజనామృతం, ఇందిరమ్మ క్యాంటీన్లు, సద్దిమూట, స్వస్థా ఆహార పథకాల ద్వారా 200 కంటే ఎక్కువ కేంద్రాల నుంచి సుమారు 15 కోట్లకు పైగా భోజనాలను అందించటం చరిత్ర అన్నారు. ఇదే మాధవ సేవ అని కొనియాడారు. సమాజానికి ఏదైనా తిరిగి ఇవ్వాలనే సేవా భావాన్ని ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమం లో అక్షయ పాత్ర ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సత్యగౌర చందాదాస ప్రభుజీ, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ , ఆర్డీవో రాజేందర్ పాల్గొన్నారు .

Leave a Reply