వోల్వో బస్సు దగ్ధం
కర్నూలు బ్యూరో, (ఆంధ్రప్రభ): కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున 1.30 గంటలకు భయానక దృశ్యం నెలకొంది. కల్లూరు మండలం చిన్న టేకూరు సమీపంలోని ఉల్లిందకొండ క్రాస్ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ వోల్వో బస్సు ఒక్కసారిగా అగ్నికి ఆహుతైంది. నిమిషాల్లోనే మంటలు బస్సును చుట్టుముట్టాయి.
సాక్షుల వివరాల ప్రకారం, బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తుండగా రాత్రి సుమారు 1.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నారని, అందులో సుమారు 30 మంది మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమిక సమాచారం.
ఎమర్జెన్సీ డోర్ పగలగొట్టి, కిటికీలను ధ్వంసం చేసి సుమారు 12 మంది బయటకు దూకి ప్రాణాలతో బయటపడినట్లు చెబుతున్నారు. గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
మంటలు ఎంత వేగంగా వ్యాపించాయంటే, క్షణాల్లోనే బస్సు మొత్తం దగ్ధమై శిధిలంగా మారిపోయింది. అగ్నిమాపక సిబ్బంది చేరుకునేలోపు వాహనం పూర్తిగా కాలిపోయింది. బస్సులోని ప్రయాణికుల సామగ్రి, డబ్బు, పత్రాలు అన్నీ దగ్ధమయ్యాయి.
స్థలానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మృతదేహాలను గుర్తించడం కష్టంగా మారడంతో అధికారులు ప్రత్యేక బృందాలతో గుర్తింపు ప్రక్రియ చేపట్టారు.
ప్రయాణికుల వివరాలను సేకరించేందుకు కర్నూలు జిల్లా పరిపాలన కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించింది. ప్రమాద కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.ప్రాథమిక అంచనాల ప్రకారం, బస్సు ఇంజిన్ భాగంలో షార్ట్ సర్క్యూట్ లేదా ట్యాంక్ సమీపంలో స్పార్క్ కారణంగా మంటలు చెలరేగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.ఈ ఘటనతో ప్రాంతమంతా షాక్‌కు గురైంది. రోడ్డు పక్కన చూసిన వారు ఆ దృశ్యాన్ని చూసి చలించిపోయారు. మంటల్లో చిక్కుకున్న వారి కేకలు చీకటిని చీల్చి భయానక వాతావరణం సృష్టించాయి.
సీఎం తీవ్ర దిగ్భ్రాంతి
• బస్సు దగ్ధమైన ఘటనలో పలువురు చనిపోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు
• ప్రమాద ఘటనను దుబాయ్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లిన అధికారులు
• సీఎస్ తో పాటు ఇతర అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్న సీఎం
• ఉన్నత స్థాయి యంత్రాంగం అంతా ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశం
• క్షతగాత్రులకు, బాధితులకు అవసరమైన సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశం
• మృతుల సంఖ్య పెరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం సూచన.