కీమోథెరపీ యూనిట్ ప్రారంభం….
గోదావరిఖని టౌన్ (ఆంధ్రప్రభ): పెద్దపల్లి జిల్లా (Peddapalli District) గోదావరిఖని ప్రభుత్వ హాస్పటల్లో క్యాన్సర్ రోగుల కోసం కీమోథెరపీ చికిత్స యూనిట్‌ను గురువారం ప్రారంభించారు. హైదరాబాద్ ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రి సూచనల మేరకు క్యాన్సర్ బాధితులకు కీమోథెరపీ చికిత్స అందించేలా ఈ ప్రత్యేక యూనిట్‌ను ఏర్పాటు చేసినట్లు వైద్యాధికారులు తెలిపారు.
ఎంఎన్‌జే ఆసుపత్రి వైద్య నిపుణులు (MNJ Hospital Medical experts) ఇచ్చిన ప్రోటోకాల్, షెడ్యూల్ ప్రకారం రోగులు చికిత్స పొందనున్నారు. రోగులు ప్రభుత్వ ఆసుపత్రికి విచ్చేసినప్పుడు మొదట వారి వైటల్ రిపోర్టులు, ల్యాబ్ పరీక్షలు పరిశీలించబడతాయి. అన్ని రిపోర్టులు సాధారణంగా ఉన్నట్లయితే, హాస్పిటల్ వైద్య బృందం ఎంఎన్‌జే ఆసుపత్రి సూచనల ఆధారంగా కీమోథెరపీని ప్రారంభిస్తుంది. రోగి వైటల్స్ లేదా పరీక్షల్లో ఏవైనా అసాధారణతలు ఉంటే, వారిని మళ్లీ ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రికి రిఫర్ చేస్తారు. ఈ యూనిట్ ప్రారంభం వల్ల గోదావరిఖని, పరిసర ప్రాంతాల క్యాన్సర్ బాధితులు ఇకపై హైదరాబాద్ ఎంఎన్‌జే ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే చికిత్స పొందే అవకాశం లభించనుంది.
ఈ కీమోథెరపీ యూనిట్ (Chemotherapy Unit) ను డాక్టర్ ఫర్దిద్, డాక్టర్ ఇర్ఫాన్ ఆధ్వర్యంలో నడుపుతున్నారు. జిల్లా కలెక్టర్, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాగూర్, మరియు ప్రభుత్వ హాస్పటల్ సూపరింటెండెంట్ సహకారంతో, ఈ యూనిట్ ప్రారంభమైందని అధికారులు తెలిపారు. కీమోథెరపీ చికిత్సలు పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలో సురక్షితంగా నిర్వహించబడుతున్నాయని ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేశారు.