తిరుపతి పోలీసుల ప్రశ్నాస్త్రాలు

తిరుపతి పోలీసుల ప్రశ్నాస్త్రాలు

టీటీడీ గోశాలలో ఆవుల మృతి ఆరోపణపై పోలీసులు విచారణ

కక్ష సాధింపు చర్యలని వైసీపీ ధ్వజం

తిరుపతి ప్రతినిధి (ఆంధ్రప్రభ): వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి (Bhumana Karunakar Reddy) గురువారం ఎస్ వి యూనివర్సిటీలో పోలీస్ విచారణకు హాజరయ్యారు. టీటీడీ గోశాలలో ఆవులు మృతి చెందాయి అంటూ భూమన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈనెల 21న తిరుపతి ఎస్వీ వర్సిటీ పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భూమన కరుణాకర్ రెడ్డి గురువారం ఉదయం 11 గంటలకు ఎస్ వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. మధ్యాహ్నం ఒంటి గంటన్నర వరకు ఆయన పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. ఈ సందర్భంగా పోలీసులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు.

టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి (Bhanuprakash Reddy) చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తాజాగా మంగళవారం ఎస్వీ వర్సిటీ పోలీస్‌ స్టేషన్‌ అధికారులు విచారణకు హాజరుకావాలని భూమనకు నోటీసులు జారీ చేశారు. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో గోవుల మృతిపై చేసిన ఆరోపణలకు ఈ నెల 23న ఉదయం 11 గంటలకు విచారణ నిమిత్తం తమ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసుకోనున్నట్లు తెలుస్తోంది.

తిరుపతి (Tirupati) లోని గోశాలపై భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. గోశాలలోని అధికారుల నిర్లక్ష్యం, సరైన పర్యవేక్షణ లేకపోవడంతో పదుల సంఖ్యలో గోవులు మరణించాయని ఆయన ఆరోపించారు. అత్యంత పవిత్రమైన గోవుల సంరక్షణ, వాటికి వైద్యం అందించడంలో సిబ్బంది పూర్తిగా విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. భూమన చేసిన ఈ ఆరోపణలు ఏపీతో పాటు దేశ వ్యాప్తంగా రాజకీయంగా సంచలనం సృష్టించాయి. మరోవైపు ఆయన చేసిన ఆరోపణలను పలువురు ఖండించారు.

ఈ నేపథ్యంలోనే భూమన వ్యాఖ్యలపై టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి గతత ఏప్రిల్‌ 17న ఎస్వీ వర్సిటీ పోలీస్‌ స్టేషన్ (SV Varsity Police Station) లో ఫిర్యాదు చేశారు. భూమన చేసిన ఆరోపణలు అసత్యమని, గో సంరక్షణశాల ప్రతిష్ఠను దెబ్బతీశాయని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. భూమన వ్యాఖ్యలు టీటీడీపై విశ్వాసం ఉంచిన భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని, ప్రజల్లో తప్పుదారి చూపించే విధంగా ఉన్నాయని ఆరోపించారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే భూమన చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని, సాక్ష్యాలు చూపాలంటూ పోలీసులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. పోలీసుల విచారణకు భూమన హాజరవుతారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.

భూమన కరుణాకర రెడ్డిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులు చర్యలకు పాల్పడుతోందని వైసీపీ నేతలు (YCP leaders) ఆరోపించారు. గోశాలలో గోవుల మరణాలపై కూటమి ప్రభుత్వం, టీటీడీ వైఫల్యాన్ని నిలదీయడంతోనే ప్రభుత్వం ఈ చర్యలుకు దిగిందన్నారు. సమాధానం చెప్పలేక భూమనపై టీటీడీ బోర్డు మెంబ‌ర్ భాను ప్రకాష్ రెడ్డి తప్పుడు ఫిర్యాదు చేశారని మండిపడ్డారు.

Leave a Reply