ఉక్రెయిన్‌కు ఎనర్జీ షాక్!

ఉక్రెయిన్‌కు ఎనర్జీ షాక్!

  • రష్యా బాంబుల‌ వర్షం
  • ఉక్రెయిన్ గ్యాస్ ప్లాంట్ ఛిద్రం

ఉక్రెయిన్‌లోని కీలక గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్‌పై రష్యా భీక‌ర‌ దాడులు చేసింది. ఖార్కివ్ ప్రాంతంలోని షెబెలింకా గ్యాస్ ప్లాంట్‌ను లక్ష్యంగా చేసుకుని రష్యా సేనలు 200కు పైగా డ్రోన్లు, 20 మిస్సైళ్లతో దాడి జరిపాయి.

ఈ దాడుల కార‌ణంగా దేశ గ్యాస్ సరఫరా వ్యవస్థకు తీవ్రమైన నష్టం కలిగింద‌ని… ఫలితంగా గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడగా, శీతాకాలం సమీపిస్తున్న తరుణంలో దేశీయ హీటింగ్ వ్యవస్థలపై ఒత్తిడి పెరిగిందని ఉక్రెయిన్‌ ఎనర్జీ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది.

దాడుల అనంతరం ఖార్కివ్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ కోతలు విధించారు. ఈ దాడులు ఉక్రెయిన్ ఇటీవలి డ్రోన్ దాడులకు ప్రతీకారంగా చేపట్టినవని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా, రష్యాలోని ఓరెన్బర్గ్ గ్యాస్ ప్లాంట్‌పై ఉక్రెయిన్ ఇటీవల జరిపిన దాడిని ప్రస్తావించింది. ఈ దాడులు ఉక్రెయిన్ గ్యాస్ ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా దెబ్బతీశాయి. ఫలితంగా యూరప్ దేశాల నుంచి గ్యాస్ దిగుమతులపై ఉక్రెయిన్ ఆధారపడే పరిస్థితి ఏర్పడింది.

ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీ ఎక్స్ (Twitter)లో చేసిన పోస్టులో, “రష్యా త‌మ‌ ఎనర్జీ సదుపాయాలను ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేస్తోంది. పౌరులు శీతాకాలంలో ఇబ్బందులు పడేలా చూడడమే వారి లక్ష్యం” అని ఆరోపించారు.

ఉక్రెయిన్ ప్రధాని యూలియా స్విరిడెంకో మాట్లాడుతూ, “ఇది కేవలం యుద్ధ చర్య కాదు, పౌరుల జీవనాన్ని భంగపరచే ఉద్దేశపూర్వక ప్రయత్నం. రాబోయే శీతాకాలంలో ఎనర్జీ సంక్షోభం మరింత తీవ్రమవుతుంది” అని హెచ్చరించారు.

Leave a Reply