కలెక్టర్ బస
ఉదయం యోగాసనం
అనంతరం అల్పాహారం
యోగక్షేమాలపై ఆరా
శ్రీ సత్యసాయి బ్యూరో, అక్టోబర్ 18 (ఆంధ్రప్రభ): శ్రీ సత్య సాయి జిల్లా (Sri SathyaSai District) కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ శుక్రవారం రాత్రి పుట్టపర్తిలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో విద్యార్థులతో పాటు బస చేశారు. సాయంత్రం 6:30 7:00 కి వసతి గృహాన్ని చేరుకున్న కలెక్టర్ విద్యార్థులతో కలిసి, వారు ఉంటున్న వసతిగృహంలో గల సదుపాయాలు, అందుతున్న ఆహారం, బోధన తదితర విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. రాత్రి వారితో పాటు కలిసి భోంచేసి అక్కడే బస చేశారు.

శనివారం ఉదయం నిద్ర లేవగానే కాళ్లకృత్యాలు తీర్చుకొని, వారితోపాటు యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ (Collector) విద్యార్థులకు నిత్యజీవితంలో చదువు అదేవిధంగా ఆటలు ఎక్సర్సైజ్ తో పాటు యోగాసనాలకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉందని తెలియజేశారు. ముఖ్యంగా శరీర దృఢత్వం మనసు ప్రశాంతత అదేవిధంగా ఒక క్రమశిక్షణ అలవర్చుకొని జీవితంలో ఉన్నతమైన స్థానంలో నిలవడానికి ఇది ఎంతో అవసరం అన్నారు.

ప్రభుత్వం తరఫున అందుతున్న సేవలు సౌకర్యాలు విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని సంక్షేమ శాఖ (Welfare Department) వసతి గృహాల అధికారులను హెచ్చరించారు. ఇలా కొన్ని గంటలపాటు జిల్లా కలెక్టర్ స్థాయిలో విద్యార్థులతో కలిసి మెలిసి ఉండి వారితో పాటు భోంచేసి, నిద్రించడం యోగాసనాలు చేయడం భవిష్యత్తుకు అవసరమైన సూచనలు సలహాలు ఇవ్వడం పట్ల సర్వత్ర హర్షం వ్యక్తం అవుతోంది. కలెక్టర్ వెంట సంక్షేమ శాఖ వసతి గృహం వార్డెన్ టి విజయ్ కుమార్ తదితర సిబ్బంది ఉన్నారు.


