ఆంధ్రప్రభ, వెబ్ న్యూస్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తులు వస్తున్నారు. వీరిలో ఇద్దరు లోకల్ హీరోస్ కావటం విశేషం. ఒకరు రాయలసీమ బిడ్డ కాగ.. మరొకరు ఉత్తరాంధ్ర మేధావి కావటం విశేషం. కొలీజియం సిఫార్సు మేరకు ముగ్గురు ఇతర రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తుల బదిలీపై ఏపీ హైకోర్టుకు రప్పిస్తున్నారు.
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదంతో త్వరలో వీరు ఏపీ హైకోర్టులో బాధ్యతలు స్వీకరించనున్నారు. గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి మానవేంద్ర నాథ్ రాయ్, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి దోనాది రమేష్ , కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి సుబేందు సమంత ఏపీ హైకోర్టులో బాధ్యతలు స్వీకరిస్తారు.
ఏపీలో విజయనగరం జిల్లాకు చెందిన జస్టిస్ మానవేంద్ర నాథ్ రాయ్ ఏపీ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసి 2023లో గుజరాత్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. చిత్తూరు జిల్లాకు చెందిన జస్టిస్ దోనాది రమేష్ అలహాబాద్ హైకోర్టు నుంచి బదిలీ అయ్యారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన జస్టిస్ సుబేందు సమంత కలకత్తా హైకోర్టు నుంచి ఏపీకి వస్తున్నారు. కొలీజియం సిఫార్సుతో ఈ బదిలీలకు రాష్ట్రపతి ఆమోదం లభించడంతో ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెరిగింది, కేసుల పరిష్కార ప్రక్రియ మరింత వేగవంతం కానుంది.