మామిడి సబ్సిడీ బ్యాంకులో జమ
31,929 మంది రైతులకు రూ.146.84 కోట్లు విడుదల
చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడి
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: మామిడి రైతులకు (mango farmers) ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇచ్చిన మాట ప్రకారం జిల్లాలోని 31,929 మంది రైతుల ఖాతాలకు రూ.146.84 కోట్లు సబ్సిడీని ప్రభుత్వం జమ చేసిందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడించారు. మంగళవారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మామిడి రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం రూ.4 సబ్సిడీ ప్రకటించిన ప్రకారం.. జిల్లాలో 31,929 మంది రైతులకు సంబంధించి 3.67 లక్షల మెట్రిక్ టన్నుల మామిడికి రూ.146.84 కోట్లు డీబీటీ పద్ధతిలో నేరుగా రైతుల ఖాతాలకు జమ చేశామని తెలిపారు.
ఇందులో బంగారుపాలెం (bangarupalem) మండలానికి చెందిన రైతులకు ఎక్కువ మొత్తం జమ అయ్యిందని, జిల్లాలో 20వేల మందికి పైగా రైతులకు లక్ష రూపాయలకు మించి సబ్సిడీ జమ అయినట్లు తెలిపారు. అర్హత కలిగి నగదు జమ కాని రైతులు (farmers) ఆందోళన చెందనవసరం లేదని అక్టోబర్ 30వ తేదీవరకు తమ వినతులను ఆర్ ఎస్ కె, మండల, జిల్లా స్థాయి ఉద్యాన అధికారులకు సమర్పించవచ్చునని తెలిపారు. రూ.5 లక్షలకు మించి సబ్సిడీకి సంబంధించి 21 మంది రైతులు ఉన్నారని, వీరి అర్హతను పరిశీలించి నగదు జమ చేస్తామని తెలిపారు.