అంతు చిక్కని అసలు నిందితులు

  • తెరమీద పొలిటికల్ రగడే
  • అధికార పార్టీలో..
  • అంతర్గత మథనం
  • ఇక వైసీపీ సరే సరి ..
  • తప్పుడు కేసులంటూ వాగ్వాదం


(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ) : చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజక వర్గం దేవళంపేటలోని అంబేద్కర్ విగ్రహానికి (Ambedkar statue) నిప్పు పెట్టి వారం రోజులకు పైగా అవుతోంది. ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అదే రోజు అక్కడ కాలిన విగ్రహం స్థానంలో కొత్త విగ్రహాన్ని స్థాపించారు. రాష్ట్రవ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకం కార్యక్రమాన్ని టీడీపీ చేపట్టింది. శనివారం రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత (Home Minister Anita) స్వయంగా దేవళంపేట వచ్చి అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కేసు విషయంలో పురోగతి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది. ఈ కేసును తప్పుదారి పట్టించాలని ప్రయత్నించినందుకు స్థానిక సర్పంచ్ గోవిందయ్యను మాత్రం పోలీసులు అరెస్టు చేశారు.

అసలు అంబేద్కర్ విగ్రహం పక్కన ఉన్న కొట్టుకు నిప్పు ఎలా అంటుకుంది? ఎవరు నిప్పు అంటించారు. అలా ఎందుకు చేశారు? ఈ మిస్టరీ (Mystery) ఇప్పటి వరకూ తేలలేదు. కొట్టుకు అంటుకున్న నిప్పును అంబేద్కర్ విగ్రహం వైపు మళ్ళించి, కాలిపోయే విధంగా కొందరు ప్రయత్నం చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. అలా ఎవరు చేశారో ఇప్పటి వరకు పోలీసులు విచారణలో తేలలేదు. ఈ వ్యవహారంలో ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అన్ని ప్రశ్నలు గానే మిగిలిపోతున్నాయి. శనివారం హోంమంత్రి అనితతో పాటు పలువురు నేతలు దేవళంపేట సందర్శించారు. నిప్పు పెట్టిన వ్యక్తి ఎవరో ఆమె కూడా చెప్పలేక పోయారు. పోలీసులు (police) ఇచ్చిన సమాచారం ప్రకారమే ఆమె మాట్లాడారు. ఈ వ్యవహారంలో బొమ్మేపల్లి సర్పంచ్ గోవిందయ్య తప్పుడు సమాచారం ప్రచారం చేసి టీడీపీ నేత సతీష్ నాయుడును ఇరికించాలని కుట్ర పన్నారని ఆరోపించారు.

ఈ నెల మూడవ తేదీ ఒక మహిళ కొబ్బరి ఆకుల పందిరికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారని పోలీసులు వెల్లడించారు. పొరపాటుగా అంబేద్కర్ విగ్రహం పాక్షికంగా కాలిందని చెప్పారు. గోవిందయ్య కక్ష సాధించాలన్న ఉద్దేశ్యంతో టీడీపీ నేత సతీష్ నాయుడు అగ్గి పెట్టారని ప్రచారం చేశారని అంటున్నారు. ఆయన కుల, మత విద్వేషాలు రెచ్చ గొట్టాలని కుట్ర పన్నారని కేసు పెట్టి అరవ తేదీ రిమాండ్ కు పంపారు. నిప్పు పెట్టిన రోజు మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి (Narayana Swamy), ఆయన కుమార్తె వైసీపీ ఇంచార్జి కృపాలక్ష్మీ తదితరులు విగ్రహం వద్ద ధర్నా చేశారు. స్థానిక టీడీపీ నేతపైనే ఆరోపణలు సంధించారు. ఇక టీడీపీ మండల కమిటీ మాజీ అధ్యక్షుడు మోహన్ మురళీ విగ్రహం ముందు నిరసన తెలిపారు. పార్టీలతో సంబంధం లేకుండా నిందితులను పట్టుకోవాలని డిమాండ్ చేశారు.

ఆయన కూడా పరోక్షంగా టీడీపీ నేతలపైనే గురి పెట్టారని తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుతున్నారు. టీడీపీ (TDP) లోని ఒక వర్గం నేతలు గోవిందయ్య , నారాయణ స్వామిని ప్రభావితం చేసి సతీష్ నాయుడు, కిషన్ చంద్ ను కేసులో ఇరికించాలని ప్రయత్నం చేసినట్టు మరో వర్గం ఆరోపిస్తోంది.. ఇదిలా ఉండగా శనివారం దేవాళంపేటలో పర్యటించిన చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాద్ రావు, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్, పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీ మోహన్, మడకశిర ఎం ఎస్ రాజు, సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ , పార్లమెంటు అధ్యక్షుడు సి అర్ రాజన్ వైసీపీ నేతలను విమర్శించడంపై దృష్టి పెట్టారు తప్ప, అసలు నిందితుడిని గూర్చి మాట్లాడలేదు. ఈ నేపధ్యంలో నిప్పే లేకుండా పొగ ఎలా వచ్చిందో అర్ధం కాలేదని కొందరు అంటున్నారు.

Leave a Reply