ఫేక్ చలా ‘మణి’ ఇలా…
తెలంగాణ న్యూస్ నెట్‌వర్క్, ఆంధ్రప్రభ : నకిలీ కరెన్సీ(Currency) తీసుకుని వాటి విలువలో సగం చెల్లించి సూట్ కేసులో పెట్టుకుని ఇంటికి చేరడం… వాటిని చలామణి చేయడం.. దొరికితే జైలు(Jail)కు పంపించడం.. ఇదీ పాత రోజుల్లో జరుగుతున్న సంఘటనలు.. కానీ ఇప్పుడు కాలం మారింది.. అంతా ఆన్‌లైన్ లావాదేవీలు.. అన్‌లైన్‌లో ఆర్డర్ పెడితే కొరియర్‌లో డెలివరీ అవుతుంది..
వాటిని చలామణి చేస్తూ దొరికిపోతే జైలుకు పంపించడం ప్రస్తుత రోజుల్లో కనిపిస్తున్న సంఘటనలు! దురాశ దుఃఖానికి చేటు అనే నానుడి ఎప్పటికీ చెరగిపోదు. దురాశతో ఎందరో యువకులు నకిలీ నోట్ల వైపు మల్లుతున్నారు. అతి వేగంగా కోటీశ్వరులు(millionaires) అయిపోవాలన్న ఆశ కూడా యువతను ఇలాంటి మార్గాల వైపు మల్లిస్తోంది. కానీ నేరప్రవృత్తి ఎప్పటికైనా జైలు పాలు చేస్తుందన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తించాలి. అలాంటి మార్గాల వైపు పయనించొద్దని హెచ్చరికాయే ఈ కథనం!
చిల్లర నోట్లు కూడా…
సాధారణంగా పెద్ద నోట్లు మాత్రమే నకిలీ ఉంటాయని అందరూ అనుకుంటారు. కానీ ట్రెండ్(trend) మారిపోయింది. రూ.20, రూ.50, రూ.100, రూ.200, రూ.500 ఇలా కూడా నకిలీ కరెన్సీ తయారు చేస్తున్నారు. అలాగే క్వాయిన్లు కూడా తయారు చేస్తున్నట్లు సమాచారం. పెద్ద నోట్లపై పోలీసుల నిఘా(police surveillance) ఉంటుందని భావించిన మోసగాళ్లు చిన్న నోట్లు నకిలీవి తయారు చేసి చలామణి చేస్తున్నారని తెలిసింది. ఈ విషయం తెలంగాణ పోలీసుల దృష్టికి వచ్చింది.
బీహార్‌లో రషీద్(Rashid) అనే వ్యక్తి ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చదువుకున్నాడు. తనకు ఉండే టాలెంట్ బట్టి కలర్, కెమికల్ మిక్సింగ్(Chemical Mixing) వాటి పై అవగాహన పెంచుకున్నాడు. నకిలీ నోట్లు తయారు చేయడానికి కావాలసినటువంటి కంప్యూటర్ ఇతర సామాన్లు కలర్స్, ఇంకు ప్రింటర్స్, కట్టర్స్, లామినేటర్స్, టోనర్స్, కలర్ ప్రింటర్ సమకూర్చుకుని ఫేక్ నోట్లు తయారు చేస్తున్నాడు.
ఫేస్ బుక్ ద్వారా ఆర్డర్లు!
ఆన్‌లైన్‌లో ఫేస్ బుక్ అతికీలకంగా ఉంటుంది. కామారెడ్డి జిల్లా రామేశ్వరపల్లి గ్రామానికి చెందిన సిద్ధాగౌడ్ అనే వ్యక్తి డబ్బులు సులభంగా సంపాదించడం ఎలా? అంటూ ఫేస్‌బుక్‌లో చూశాడు. ఆయనకు కాస్తా దురాశ పెరిగింది. ఫేస్ బుక్‌లో వచ్చిన నెంబర్‌ను చూసి కాల్ చేశాడు. దీంతో ఫేస్‌బుక్‌లో ఫేక్ కరెన్సీ గ్రూపు ఉందని అందులో ఉన్న ఫోన్ నెంబర్ల(Phone Numbers)కు కాంటాక్ట్ కావాలని మెసెజ్ వచ్చింది.
ఫేక్ కరెన్సీ గ్రూపులో ఉన్న నెంబర్‌తో కాంటాక్ట్ అయితే 1ః2 రేషియో కరెన్సీ ఇస్తామని , స్కానర్ పంపించారు. ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇవ్వగా ఆయన అడ్రస్‌కు కొరియర్ ద్వారా నకిలీ కరెన్సీ వచ్చింది. వాటిని చలామణి చేస్తుండగా ఓ వైన్స్ షాపు(Wine Shop) ఉద్యోగి ఫిర్యాదు మేరకు కామారెడ్డి పోలీసులు రంగంలోకి దిగి సిద్దాగౌడ్‌ను అరెస్టు చేశారు.
తీగ లాగితే.. ఇలా డొంక కదిలింది!
ఈ విషయం కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర(Rajesh Chandra) దృష్టికి వచ్చింది. వెంటనే ఎనిమిది బృందాలు ఏర్పాటు చేసి రంగంలోకి దించారు. తీగ లాగితే డొంక కదిలినట్లు మొత్తం ముఠా గుట్టు రట్టు చేశారు. తెలంగాణలో దొరికిన తీగను లాగారు. ఉత్తరభారతదేశంలో ఉన్న డొంకను కదిలించారు. ముఠాను పట్టుకున్నారు.
దొరికిన ముఠా సభ్యులు..
కామారెడ్డి పోలీసులు పట్టుకున్న ముఠా సభ్యులు వీరే. ముఠా సభ్యులు సిద్ధాగౌడ్ (తెలంగాణ), ఇబ్నుల్ రషీద్ (బీహార్), నందు లాల్ జంగ్ డే (ఛత్తీస్‌గఢ్), చట్టరామ్(ఛత్తీస్‌గఢ్), సౌరవ్ డే(Sourav Dey) (పశ్చిమ బెంగాల్), హరి నారాయణ భగత్ (పశ్చిమ బెంగాల్), పండిత్ ఏ శారతక్ జా (పశ్చిమ బెంగాల్), కరెన్సీ కాట్ని ఏ లఖన్ కుమార్ దుబే(A Lakhan Kumar Dubey), (యూపీ), దివాకర్ చౌదరి ఏ బ్రిజేష్ కుమార్ (యూపీ) సత్య దేవ్ యాదవ్ (యూపీ) శివ శర్మ ఏ ప్రమోద్ కాట్రే (మహారాష్ట్ర) , కృతిక రాజ్ (యూపీ) మొత్తం 12 మంది. ఇప్పటికి ఎనిమిది మందిని అరెస్టు చేయగా, మరో నలుగురిని అరెస్టు చేయాల్సి ఉంది. వారి కోసం తెలంగాణ పోలీసులు గాలిస్తున్నారు.
నేరప్రవృత్తి ఎప్పటికైనా డేంజరే!
నేరప్రవృత్తి, అసాంఘిక చర్యలకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలి. ఎందుకంటే నేరప్రవృత్తి ఎప్పటికైనా డేంజరే(Danger)! అది యువత గమనించాలి. సులభంగా డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో నేరప్రవృత్తిలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తస్మాత్ జాగ్రత్త!