జీమూతకేతు

పూర్వం ఒకప్పుడు మందరపర్వతం పరిసర ప్రాంతాలలో మరికొన్ని రోజులలో గ్రీష్మ ఋతువు ప్రారంభం కాబోతూండడాన్ని గ్ర‌హించిన‌ హేమవతి పతిదేవుడైన శివుడిని అడిగింది ”స్వామీ, త్వరలో గ్రీష్మ ఋతువు ఆగమన చిహ్నాలు స్పష్టంగా కనపడుతున్నాయి. గ్రీష్మ బుతువు అంటే వడగాడ్పులు, వేడి వాతావరణం అంతటా నిండిపోతుందని తెలిసినదే. మరి తలదాచుకోవడానికి సరైన ఇల్లు లేకుండా మనం ఎలా ఆ వేసవి కాలంలో రోజులు గడపగలం? ఒక్కసారి ఆలోచించండి స్వామీ!”
అలా అడిగిన దాక్షాయని మాటలను ఆలకించిన శివుడు ”దేవీ, మనకు ఎప్పుడైనా ఒక ఇల్లు ఉండడం చూసావా? మొదటి నుండీ మనది వనాలలో నివాసమే కదా! ఇప్పుడు కొత్తగా ఈ కంగారేమిటి?” అని అడిగాడు. శంకరుడు అలా చెప్పేసరికి మరేమీ ఎదురు మాట్లాడలేకపోయింది సతీదేవి. శంకరుడితో కలిసి వనాలలోని చెట్ల నీడలలో, నదీ తీర ప్రాంతాలలో ఉంటూ రోజులు గడిపింది. అలా గ్రీష్మ ఋతువు గడిచిపోయింది. వర్ష ఋతువు వచ్చింది. అన్ని దిక్కలా నల్లని మేఘాలు ఆవరించగా, అంతటా అంధకారం అలుముకుంది. అది చూసిన పార్వతి, పతిని సమీపించి ఇలా అన్నది ”గాలి చాలా వేగంగా వీస్తున్నది. మేఘాలు గర్జించడం మొదలు పెట్టాయి. కనులు మిరుమిట్లు గొలుపుతూ ఆకాశంలో మెరుపులు మెరుస్తున్నాయి. మయూరాలు క్రేంకణ ధ్వనులు చేస్తున్నాయి. ఆకాశం నుండి కురుస్తున్న జలధారలు నేలను తాకి లయబద్ధమైన వింత శబ్దం చేస్తున్నాయి. నీటితో నిండుతున్న జలాశయాలపై కొంగల గంపులు పంక్తులుగా ఎగురుతున్నాయి. బలంగా విచే గాలుల తాకిడికి కదంబ, కేతకి, అర్జున వృక్షాలు పుష్పాలను రాలుస్తున్నాయి. చుట్టుపక్కల ప్రతిధ్వనిస్తున్న మేఘాల గర్జనకు భీతిల్లిన హంసలు, సకల సంపదలతో సమృద్ధిగా ఉన్న ఇళ్ళను యోగిజనం వదిలివెళ్ళినట్లుగా, జలాశయాలను వదిలి వెళ్ళిపోతున్నాయి. వనాలలో మృగాల గుంపులు ఆనంద పరవశంలో అటూ ఇటూ ఊరికే పరిగెడుతున్నాయి. చంద్రశేఖరా, ప్రకృతి ఇంత ఆహ్లాదకరంగా మారి జనుల హృదయాలకు అమితోల్లాసాన్ని కలిగించేదిగా ఉండగా, అమాయకులైన అందమైన ఆడపిల్లలు, కపటాత్ములైన పురుషుల మాయ మాటలను నమ్మి మోసపోవడంలో ఆశ్చర్యమేముంటుంది స్వామీ!”
శంకరుడు ఏమీ మాట్లాడక ఊరుకుండడం చూసిన పార్వతి తానే ”ఇటువంటి దుస్సహమైన, అద్భుతమైన వాతావరణంలో నా ప్రార్థనను మన్నించి, స్వామివారు ఈ మహత్తు కలిగిన ఉత్తమమైన పర్వతంపై ఒక చిన్న ఇంటిని నిర్మిస్తే బాగుంటుంది. నివాసం ఉండడానికి ఒక గూడు అమరి నా దిగులు తీరుతుందని విన్నపం” అంది.
వీనులకువిందు కలిగిస్తున్న పార్వతి మాటలు విన్న ఫాలలోచనుడు, త్రినేత్రుడు అయిన శంకరుడు ”పార్వతీ! నీవు కోరినట్లుగా ఇల్లు నిర్మించుకుంటే బాగానే ఉంటుంది. కాని నా దగ్గర ఇంటి నిర్మాణానికి కావలసినంత డబ్బు లేదుకదా! వ్యాఘ్రచర్మధారినై శరీరాన్ని కప్పుకుని తిరిగేవాడిని నేను. సర్పములను ఆభూషణములుగా కలిగినవాడను దేవీ!” అన్నాడు అనునయంగా.
శంకరుడు అలా అనగా ”వేసవికాలంలో అయితే చెట్లనీడలలో ఎలాగోలాకాలం గడిచిపోయింది. కానీ ఇప్పుడు ఈ వర్షాకాలంలో అలా సాధ్యం కాదు కదా ప్రభూ!” అన్నది పార్వతి.
పార్వతి ఆ మాటలకు ”ఆకాశంలో మేఘమండలం కంటే కూడా పైనకు చేరుకుంటే వర్షపు నీరు మీద పడి శరీరం తడిసే సమస్య ఉండదుగా దేవీ!” అన్నాడు శంకరుడు. అలా చెప్పిన శంకరుడు పార్వతిని వెంటనిడుకుని, ఆకాశంలో ఉన్నతమైన మేఘమండలాల స్థాయిని దాటి మరింత పైకి వెళ్ళి, అక్కడ ఉండిపోయారు. అప్పటినుండి దేవలోకంలో శంకరుడికి ‘జీమూతకేతు’ అనే పేరు ప్రఖ్యాతమై నిలిచిందని ‘వామన పురాణం’ ప్రథమాధ్యాయంలో చెప్పబడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *