- అల్లాడుతున్న జనం
- ఫిల్టర్ బెడ్ లో నీటి శుద్ధికి బూడిద బ్రేక్
- మూడు రోజులుగా.. తాగునీటి సరఫరా స్థంభన
ఎన్టీటీపీఎస్ అధికారుల నిర్లక్ష్యం నియోజకవర్గ ప్రజలకు శాపంగా మారింది. వారి వికృత చర్యలు మాఫియాను మించిపోవడం ఈ ప్రాంత ప్రజలకు ఆగ్రహం తెప్పిస్తోంది. విచక్షణ లేకుండా, అనాలోచితంగా వ్యవహరించడంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. తానా అంటే తందానా అన్నట్లు మిగిలిన ప్రభుత్వ వ్యవస్థలన్నీ పనిచేయకుండా చేష్టలుడిగి కూర్చోవడంతో పరిస్థితి దారుణంగా తయారైంది. ఈ ఎన్టీటీపీఎస్ శాపం నుంచి ఇంకెప్పుడు బయట పడతామని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఆంధ్రప్రభ, ఇబ్రహీంపట్నం (ఎన్టీఆర్ జిల్లా) : గత మూడు రోజుల నుంచి మైలవరం నియోజకవర్గ ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతున్నారు. ఎన్టీటీపీఎస్ బూడిద నీరు కృష్ణా నదిలో కలవడమే ఇందుకు కారణం. బూడిద చెరువులోకి మళ్లించాల్సిన బూడిదను రెండు రోజుల కిందట ఎన్టీటీపీఎస్ అధికారులు బుడమేరు డైవర్షన్ చానల్ (వేడినీళ్ల కాలువ) మీదుగా కృష్ణా నదిలోకి వదిలేశారు. కృష్ణా నదిలో పెద్ద ఎత్తున బూడిద నీటితో నిండిపోయి తాగునీరు కలుషితమైంది.
అలాగే కూలింగ్ కెనాల్ లో కూడా బూడిద నీరు కలుస్తోంది. ఫిల్టర్ బెడ్ లో శుద్ధి చేసే తాగునీటి లో పెద్ద ఎత్తున బూడిద కలవడంతో నీరు శుద్ధి కావడం లేదు. దీంతో మూడు రోజుల నుంచి మైలవరం నియోజకవర్గంలో తాగునీటి సరఫరా నిలిచిపోయింది. ఎన్టీటీపీఎస్ వికృత చర్యల వల్ల నియోజకవర్గంలోని 104 గ్రామాల ప్రజలు తాగునీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. గుక్కెడు నీటితో గొంతు తడుపుకునేందుకు వాటర్ ప్లాంట్ల వద్ద క్యూ కడుతున్నారు. ఇక ట్యాంకర్ల ద్వారా ప్రజలకు తాగునీరు సరఫరా చేయాలన్న ఆలోచన ప్రభుత్వ అధికారుల్లో కనిపించలేదు. దీంతో ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు.