సమస్యను తప్పకుండా పరిష్కరిస్తా

  • జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్


శ్రీ సత్య సాయి బ్యూరో, అక్టోబర్ 6 (ఆంధ్రప్రభ): సాధారణంగా ఉన్నత స్థాయి అధికారి వద్దకు సామాన్యులు తమ సమస్యలను చెప్పుకునేందుకు వెళతారు. కానీ దివ్యాంగులు జిల్లా ఎస్పీకి తమ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చారని తెలుసుకొని, జిల్లా ఎస్పీయే దివ్యాంగుల దగ్గరకు వచ్చి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం విశేషం.

సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో (conference hall) ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీకి తమ సమస్యలు, విన్నవించేందుకు దివ్యాంగులు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ (SP S Satish Kumar) వారి వద్దకే వెళ్లి వారి పరిస్థితులు, సమస్యను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా వారి వారి సమస్యలపై సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా తెలియజేసి, సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (Public Grievance Redressal Platform) కార్యక్రమం నిర్వహించగా, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాదుదారులతో ఎస్పీ మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. ఫిర్యాదులపై సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్ లో మాట్లాడి బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై చట్ట పరిధిలో విచారించి న్యాయపరమైనటువంటి వాటికి సత్వరమే న్యాయం చేయాలని ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో కుటుంబ కలహాలు, భూ తగాదాలు, సైబర్ మోసాలు, వరకట్నం వేధింపులు, తదితర వంటి సమస్యలపై ఈ రోజు మొత్తం 65,ఫిర్యాదులు అందజేశారు. ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు, మహిళా పిఎస్ స్టేషన్ డిఎస్పి ఆదినారాయణ, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply