ఆంధ్రప్రభ, విజయపురి సౌత్ (పల్నాడు జిల్లా) : భారీ వర్షాలకు పర్యాటక ప్రాంతమైన ఎత్తిపోతల జల పాతం జలకళను సంతరించుకుంది. ఎగువ ప్రాంతాలలో భారీగా వర్షాలు లు కురుస్తుంటే ఎత్తిపోతలకు వాగులు, అటవీ మార్గాల ద్వారా వరద వచ్చి చేరుతోంది. నల్లమల నుంచి పరవళ్ళు తొక్కుతూ వచ్చే మూడు వాగుల సంఘమమే ఎత్తిపోతల జలపాతం.
ఈ నీరు 70 అడుగుల ఎత్తు నుంచి కిందకు ప్రవహిస్తూ ఉండటంతో జలపాతం నయాగరా అందాలను తలపి స్తోంది. ఎత్తిపోతల జలపాతం 70 అడుగుల ఎత్తైన జలపాతం. కృష్ణానది ఉపనది అయిన నక్కవాగు, చంద్రవంక వాగు, తుమ్మల వాగు కలయికే ఈ సుందర జల పాతం. చుట్టూ ఎత్తైన కొండలు, దట్టమైన అడవులు పాల నురగల జలపాతాలతో పర్యాటకులను ఎంతో అబ్బురపరుస్తుంది.
నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా ఎత్తిపోతలకు నీటి ప్రవాహాం ఉదృతంగా ఉండ టంతో మట్టితో కూడిన ఎర్ర నీరు వచ్చి చేరుతుంది ఆ నీరు అంత ఎత్తైన కొండల నుంచి కిందకు పడుతుండటంతో పర్యాటకులు ఆ సుందర దృశ్యాన్ని చూసేందుకు బారులు తీరుతున్నారు. పర్యాటకుల భారీ స్థాయిలో రావటంతో ఎత్తిపోతల ఆదాయం లక్ష రూపాయలు వచ్చినట్లు అధికారులు తెలిపారు.