అడవి జంతువుల దాడిలో భార్య, భర్త మృతి
ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్ : కొమురం భీం (Komaram Bheem) జిల్లా సిర్పూర్ టి మండలం భీమన్న అటవీ శివారులో ఇద్దరు పశువుల కాపరుల మృతదేహాలు కలకలం సృష్టించాయి. సిర్పూర్ టి మండలం అచ్చలి గ్రామానికి చెందిన దూలం శేఖర్ (Dhulam Shekhar) (40), దూలం సుశీల (Dhulam Sushila) (36) భార్యాభర్తలిద్దరూ పశువుల కాపరులుగా జీవనం సాగిస్తున్నారు. గురువారం పశువుల మందను తోలుకొని మేత కోసం భీమన్న అటవీ శివారు ప్రాంతానికి వెళ్లారు. సాయంత్రం యధావిధిగా పశువులన్నీ ఇంటికి చేరినప్పటికీ, వీటితోపాటు రావలసిన పశువుల కాపరులు ఇద్దరూ రాత్రి వరకు ఇంటికి చేరలేదు.

దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. దూలం శేఖర్ వద్ద ఉన్న సెల్ ఫోన్ కు ఫోన్ చేసినా సమాధానం రాకపోవడంతో పోలీసులు, అటవీ సిబ్బందికి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. అటవీ సిబ్బంది (Forest staff), పోలీసులతో కలిసి సమీప అటవీ ప్రాంతంలో గాలించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత రక్తసిక్త గాయాలతో చెట్ల పొదల్లో పడి ఉన్న రెండు మృతదేహాలు కనిపించాయి. పేద కుటుంబానికి చెందిన ఇద్దరు పశువుల కాపరులు మృతి చెందడంతో గ్రామంలో విషాదం (Tragedy) అలుముకుంది. వీరికి ముగ్గురు అమ్మాయిలు ఒక కుమారుడు ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను సిర్పూర్ టి ఆసుపత్రికి తరలించారు.

పెద్దపులి లేదా చిరుత పులి అనుమానాలు…
పశువుల కాపరుల దాడుల్లో మృతి చెందిన దంపతుల తలకు బలమైన గాయాలు (couple injured), రక్తసిక్తంగా గోళ్లతో గీరిన గుర్తుల ఆధారంగా పెద్దపులి లేదా చిరుత పులి దాడి చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాంతంలో కొంతకాలంగా పెద్దపల్లి సంచరిస్తున్నట్టు గ్రామస్తులు తెలిపారు. ఎలుగుబంటి దాడి కూడా చేసి ఉండవచ్చని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు. సంఘటన స్థలంలో అటవీ శాఖ అధికారులు జంతువుల పాదముద్రల నమూనాలను సేకరిస్తున్నారు. ఎఫ్డీఓ సుశాంత్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
