భక్తులు కోరినన్ని లడ్డూ ప్రసాదం సిద్ధం
- 11 రోజులకు 36 లక్షల లడ్డూలు…
- మూలా నక్షత్రం, విజయదశమి రోజున ఉచిత లడ్డు ప్రసాదం పంపిణీ
- నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు
- జిల్లా కలెక్టర్ డా. జీ.లక్ష్మీశ
ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : విజయవాడ(Vijayawada)లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి(Shri Durga Malleswara Swamy) వార్ల దేవస్థానానికి ఉన్న ప్రత్యేకతలలో లడ్డు ప్రసాదం కూడా అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జీ.లక్ష్మీశ అన్నారు.
అమ్మవారిని దర్శించుకున్న ప్రతి ఒక్కరు ఎక్కువ మొత్తంలో లడ్డూలు కొనుగోలు చేస్తారని, సాధారణంగా మామూలు రోజుల్లోనే లడ్డు ప్రసాదానికి ఎక్కువ డిమాండ్(Demand) ఉంటుందని, నవరాత్రి రోజులలో లడ్డు ప్రసాదం డిమాండ్ మరింత పెరుగుతుందని, దీనిని దృష్టిలో పెట్టుకుని శరన్నవరాత్రి ఉత్సవాలకు వస్తున్నభక్తులకు కోరినన్నిలడ్డూలు సిద్ధంగా ఉంచామని ఆయన తెలిపారు.
లడ్డు ప్రసాద తయారీ కేంద్రాలను మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. మొత్తంగా నవరాత్రి ఉత్సవాల(Navratri Utsavala)కు 36 లక్షల లడ్డూలు అవసరమవుతాయని భావించి, ఆ మేరకు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
ఇంకా ఎక్కువ అవసరమైతే తయారు చేసేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని పేర్కొన్నారు. మూలా నక్షత్రం(Moola Nakshatra) సందర్భంగా భక్తుల సంఖ్య అసాధారణ స్థాయిలో ఉంటుందన్నారు. అదే సమయంలో లడ్డు ప్రసాదానికి కూడా డిమాండ్ పెరుగుతుందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని లడ్డూలను ఇప్పటికే సిద్ధంగా ఉంచామన్నారు.
భక్తులకు ఆరోజు ఉచిత లడ్డు ప్రసాదం కూడా అందించడం జరుగుతుందన్నారు. రోజువారి రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రసాద విక్రయ కేంద్రాలను అప్పటికప్పుడు పెంచేందుకు దేవస్థానం సిబ్బంది సిద్ధంగా ఉన్నారని వివరించారు. ఇప్పటికే కనకదుర్గ నగర్‌తో పాటు రైల్వే స్టేషన్(Railway Station), బస్టాండ్ తదితర ప్రాంతాల్లో కూడా ప్రసాద విక్రయ కేంద్రాలు ఉన్నాయని.. భక్తులు ఆయా కేంద్రాల్లో కూడా కొనుగోలు చేయవచ్చని పేర్కొన్నారు. ప్రసాదం తయారీకి వినియోగిస్తున్నముడి సరుకుల నాణ్యత కూడా పరిశీలించారు.
లడ్డూలు ఎక్కువ కాలం నిలువ ఉండేలా అత్యంత నాణ్యత కలిగిన శనగపిండి, పంచదార, నూనె, నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, యాలకుల పొడి వాడుతున్నట్లుగా గమనించారు. అత్యంత పరిశుభ్ర వాతావరణంలో ఈ లడ్డు ప్రసాదం తయారు అవుతోందని వివరించారు.
లడ్డు తయారీ కేంద్రాల నుంచి ఇతర ప్రాంతాల లడ్డు విక్రయ కేంద్రాలకు రవాణా చేసే సమయంలో రవాణా వాహనాలకు ఎదురవుతున్నట్రాఫిక్(Traffic) ఇబ్బందులను చక్క దిద్దాలని పోలీస్ శాఖను ఆదేశించారు. ఈ క్షేత్రస్థాయి పర్యటనలో దేవస్థానం ప్రసాదం కేంద్రం సహాయక అధికారి ఎం ఎస్ ఎల్ శ్రీనివాస్, పర్యవేక్షణ అధికారి శ్రీనివాసరావు(Srinivasa Rao) తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.
రియల్ టైం ఫీడ్ బ్యాక్ ఆధారంగా సేవలు
రియల్ టైం ఫీడ్ బ్యాక్(Feedback) ఆధారంగా భక్తులకు సేవలు అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఇంద్రకీలాద్రి మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ తెలిపారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ చేసిన ఏర్పాట్లు సత్ఫలితాలు ఇస్తున్నాయని పేర్కొన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణీలు, బాలింతలకు ప్రత్యేక రవాణా సదుపాయం కల్పించామని తెలిపారు.
