ఈరోజు అలంకరణ అన్నపూర్ణమాత…

అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవ్లభే
ఙ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ
మాత చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వరః
బాంధవా శ్శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్‌ !!

దసరా నవరాత్రుల తదియ నాడు అమ్మవారిని అన్నపూర్ణమాతగా కొలుస్తారు. సృష్టిలోని ప్రతీజీవికి కావలసిన చైతన్యం కలిగించే మహాశక్తి జగత్కారిణి. త్రిమూర్తులకు పెద్దమ్మగా పిలువబడే ఈమె ఒక చేతిలో అక్షయ పాత్రతో మరియొక చేతిలో గరిటెతో దర్శనమిస్తుంది కావున ఈమెను అన్నపూర్ణగా పూజిస్తారు.

సాక్షాత్తు పరమేశ్వరునికే బిక్షనొసంగిన అన్నపూర్ణ అక్షయములైన శుభాలను కలిగిస్తుంది. హిందూ సంప్రదాయములో అన్నమును పరబ్రహ్మ స్వరూపంగా ఆరాధిస్తారు, అన్నదానమునకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఒకసారి పార్వతీ పరమేశ్వరుల మధ్య వాగ్యాదం చెలరేగి నప్పుడు పార్వతి అలిగి కైలాసమును వీడి వెళ్ళిపోతుంది.

ఎప్పుడైతే పార్వతి కైలాశమును వీడి వెళ్ళిపోతుందో అప్పటినుండి శివునకు అన్నం దొరకక ఇబ్బంది పడతాడు. ఇంటింటికి తిరిగి భిక్షమెత్తుకొనేందుకు ప్రయత్నం చేయగా ఎవరి ఇంటా అన్నం దొరకక క్షామము ఎర్పడుతుంది.

అప్పడు పరమేశ్వరుడు పార్వతి జాడ తెలుసుకునే ప్రయత్నం చేయగా, ఆమె అన్నపూర్ణగా కాశీలో అన్నం దానం చేస్తుందని తెలుసుకుని తన పుత్రులతో కలసి అక్కడివెళ్ళి ఆమెను అన్నమునకై భిక్షాటన చేస్తాడు. ఆమె ప్రసన్నురాలై శివునకు, తన కుమారులకు అన్నం ప్రసాదిస్తుంది.

అప్పటినుండి లోకమంతా క్షామము తొలగి సుఖశాంతుతో ఉంటారు. అప్పటినుండి పార్వతీదేవిని అన్నపూర్ణ మాతగా ఆరాధించి అన్న వస్త్రాలకు లోటురాకుండా జీవించారు. ఈ రోజు అన్నపూర్ణాష్టక పారాయణ శుభదాయకము.

అన్నపూర్ణాష్టకమ్‌

నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ
నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్షమాహేశ్వరీ
ప్రాలేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాsన్నపూర్ణేశ్వరీ!!

ఈ విధంగా సాగే అన్నపూర్ణాష్టకము చదివితే సకల మనోభీష్టాలు నెరవేరుతాయి.

శ్రీశైంలోని భ్రమరాంబ రావణ వాహనంపై చంద్రఘంటగా దర్శనమిస్తారు.

చంద్రఘంట శ్లోకము
శ్లో. పిండజప్రవరూరుఢా చంద్రకోపాస్త్ర కైర్యుతా ! ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా !!

శుభం భూయాత్‌!!

డా. దేవులపల్లి పద్మజ

Leave a Reply