ఇది నా బీచ్ ..కాపాడుకుంటా
- ఫ్లాస్టిక్ వద్దు.. తట్ట బుట్ట ముద్దు
- పేరూరు బీచ్ లో కలెక్టర్ హల్ చల్
భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో: జల, చర ప్రాణుల సంరక్షణలో సముద్ర తీర ప్రాంత సమతుల్యతకు ప్రతి ఒక్కరు బాధ్యతగా మెలగాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి (Chadalawada Nagarani) సూచించారు. అంతర్జాతీయ తీరప్రాంత శుభ్రపరిచే దినోత్సవం సందర్భంగా శనివారం పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్ లో బీచ్ క్లీనింగ్ క్యాంపెయిన్ లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
విద్యార్థులు, వివిధ స్వచ్ఛంద సంస్థలు, డ్వాక్రా, మెప్మా మహిళలు, పరిశ్రమంల ప్రతినిధులు, అధికారులు, తదితరులతో కలిసి బీచ్ క్లీనింగ్ నందు జిల్లా కలెక్టర్ (District Collector) స్వయంగా పాల్గొని ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో నరసాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ పాల్గొన్నారు. బీచ్ ప్రాంతాన్ని శుభ్రపరిచేందుకు పెద్ద ఎత్తున విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు పోటీ పడటంతో బీచ్ ప్రాంతం అంతా కోలహాలంగా పండుగ వాతావరణాన్ని తలపించింది. అందరూ చేయి చేయి కలిపి గోనెసంచెలు, మేదర బుట్టలలోనికి చెత్తను సేకరించి టాక్టర్లలో డంప్ చేయడం విద్యార్థులకు పర్యావరణం పట్ల స్ఫూర్తిదాయకంగా నిలిచింది అనడంలో సందేహం లేదు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ… చిన్ననాటి నుండే విద్యార్థులకు పర్యావరణం పట్ల అవగాహన కల్పించడం ద్వారా కాలుష్య నియంత్రణకు ముందడుగు వేయడమే అన్నారు.
మానవ మనుగుడికే ముప్పు వాటిల్లేల పర్యావరణాన్ని కొన్ని చర్యలు దెబ్బతిస్తున్నాయని, దీని కారణంగా అనేక మొక్కలు, జంతువులు అంతరించిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. క్లీనింగ్ కార్యక్రమం ఒక్కరోజుతో పరిమితం కాకుండా ప్రతిరోజు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇప్పటికే జిల్లాలో ప్లాస్టిక్ నిషేధాన్ని (plastic Ban) అమలు చేసుకుంటున్నామని, దీనిలో భాగంగా నేను చెత్తను సేకరించడానికి ప్లాస్టిక్ బిన్ లకు బదులుగా మేదర తట్టలను, గోనె సంచులను వినియోగించినట్టు తెలిపారు. మేదర తట్టల వినియోగంతో పర్యావరణానికి హితం చేకూర్చితే అంతరిస్తున్న చేతివృత్తులకు ఊతం లభిస్తుందన్నారు.
పర్యావరణానికి అనుకూలమైన జీవనశైలిని అవలంబించడానికి జీవితంలో నీటిని, శక్తిని ఆదా చేయడానికి కృషి చేయాలన్నారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వాడకాన్ని మానివేయడం, ఎలక్ట్రానిక్ వ్యర్ధాలను తగ్గించడం, స్థిరమైన ఆహార అలవాట్లను ఆరోగ్యకరమైన జీవనశైలని అవలంబించాలని కలెక్టర్ పేర్కొన్నారు. నా బీచ్ ని కాపాడుకుంటానని, ఆరోగ్యకరమైన సముద్రం ఎంతో అవసరమని అర్థం చేసుకున్నానని, మహా సముద్రాన్ని కాలుష్యం, వ్యర్ధాల నుండి రక్షించాలని అర్థం చేసుకున్నానని, పకృతితో సామరస్యంగా జీవించాలని సేవా పర్వ్ – 2025 (Seva Parv – 2025) ప్రతిజ్ఞను అందరితో చేయించారు. సముద్ర తీర ప్రాంతం శుభ్రపరచడంలో ఉత్సాహంగా పాల్గొన్న పాఠశాలలకు, కళాశాలలకు, వివిధ శాఖలకు సర్టిఫికెట్లను అందజేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా చివరిగా తీరానికి హరిత రక్షణ కవచం జీవకోటికి అభయ హస్తంగా నిలిచే తాటి వనాలను పెంచే సంకల్పంతో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, స్థానిక శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ సముద్రం తీరం వెంబడి తాటి విత్తనాలను నాటారు.
ఈ కార్యక్రమంలో నరసాపురం ఆర్డీవో దాసిరాజు (Narasapuram RDO Dasiraju), డి.ఎస్.పి డాక్టర్ శ్రీ వేద, జిల్లా నోడల్ అధికారి మరియు భీమవరం డి ఎల్ డి ఓ వై.దోసి రెడ్డి, జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇ.వెంకటేశ్వర్లు, డిపిఓ ఎం.రామ్ నాథ్ రెడ్డి, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి బి.శ్రీనివాసరావు, జిల్లా చేనేత అధికారి కె.అప్పారావు, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యు.మంగపతి రావు, డీఈవో ఇ.నారాయణ, జిల్లా టూరిజం అధికారి ఏ.వి అప్పారావు, నరసాపురం మున్సిపల్ కమిషనర్, ఎం.అంజయ్య, తహాసిల్దార్, కె.రాజ్ కిషోర్, ఎంపీడీవో సి హెచ్ త్రిశూలపాని, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు, మత్స్యకార సంక్షేమ సమితి ప్రతినిధులు, వివిధ పరిశ్రమల ప్రతినిధులు, వివిధ పాఠశాల, కళాశాలల విద్యార్థులు, ఎన్.సి.సి., ఎన్ఎస్ఎస్ క్యాడేట్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నారు.