50 ఎకరాల్లో అమరావతి క్వాంటం వ్యాలీ
90 వేల ఉద్యోగులతో కళకళ
2027కి మరో మూడు ఐబీఎం కంప్యూటర్లు
ఏటా రూ.5 వేల కోట్ల ఎగుమతులే లక్ష్యం
రూ.1000 కోట్లతో వంద అంకుర సంస్థల ఏర్పాటు
ఏపీ ఐటీ ఆర్టీజీ శాఖల కార్యదర్శి వెల్లడి
(ఆంధ్రప్రభ, అమరావతి) : అమరావతి (Amaravati) క్వాంటం వ్యాలీలో వచ్చే జనవరి కల్లా రెండు క్వాంటం కంప్యూటర్లను ఐబీఎం సంస్థ (IBM company) ఏర్పాటు చేయనుందని, 2027 నాటికి మరో మూడు కంప్యూటర్లు సిద్ధం చేస్తోందని రాష్ట్ర ఐటీ ఆర్టీజీ శాఖల కార్యదర్శి భాస్కర్ కాటంనేని (Bhaskar Katanneni) వెల్లడించారు. సచివాలయంలో జరుగుతున్న జిల్లా కలెక్టర్ల సదస్సు (District Collectors’ Meeting) రెండవ రోజు ఆయన అమరావతి క్వాంటం వ్యాలీ ఏర్పాటుపై ప్రజంటేషన్ ఇచ్చారు. గ్లోబల్ క్వాంటం డెస్టినేషన్‌గా ఏపీని మార్చాలనే దిశగా పనులు చేపడుతున్నామన్నారు. ఇందుకోసం రెండు దశలుగా రోడ్ మ్యాప్ రూపొందించి ముందుకు వెళ్తున్నామని వివరించారు.
రూ.5వేల కోట్ల ఎగుమతులే లక్ష్యం..
2030 నాటికి అమరావతి క్వాంటం వ్యాలీ నుంచి ఏటా 5వేల కోట్ల మేర క్వాంటం హార్డ్‌వేర్ (Hardware) ఎగుమతుల సాధనే లక్ష్యమన్నారు. ఏటా 5 వేల మందికి క్వాంటం కంప్యూటింగ్‌లో నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. రూ.వెయ్యి కోట్ల ప్రోత్సాహకాలతో క్వాంటం వ్యాలీలో కనీసం 100 అంకుర సంస్థలు (స్టార్టప్‌లు) ఏర్పాటే సంకల్పమన్నారు. క్వాంటం వ్యాలీ రాకతో రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు వస్తాయన్నారు. వైద్య ఆరోగ్యం (Medical Health), బీమా, ఫైనాన్స్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, మెటీరియల్ సైన్స్ అండ్ కెమిస్ట్రీ, ఆప్టిమైజేషన్ అండ్ లాజిస్టిక్స్, క్లైమేట్, ఎనర్జీ అండ్ ఎన్విరాన్‌మెంట సహా మొత్తం 14 రంగాల్లో క్వాంటం కంప్యూటింగ్ లాగర్థమ్స్‌తో అద్భుత ఫలితాలు రాబట్టవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.
50 ఎకరాల్లో క్వాంటం వ్యాలీ
రాజధాని అమరావతిలో అమరావతి క్వాంటం వ్యాలీ (Amaravati Quantum Valley) నిర్మాణం కొరకు సీఆర్డీఏ ఇప్పటికే 50 ఎకరాల భూమిని కేటాయించిందని తెలిపారు. ఇక్కడ క్వాంటం వ్యాలీ భవన నిర్మాణానికి సంబంధించి భవన నమూనాలు సిద్ధం చేశామని వెల్లడించారు.ఈ భవనంలో దాదాపు 80 నుంచి 90 వేల మంది పనిచేయనున్నారు. భవన సముదాయంలో భవిష్యత్తులో 3లక్షల క్యూబిట్ క్వాంటం కంప్యూటర్లు పనిచేయనున్నాయని చెప్పారు. క్వాంటం వ్యాలీలో పెట్టుబడులు, కార్యకలాపాలు సాగించడానికి ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ సంస్థలు ముందుకు వచ్చాయని, ఈ సంస్థలతో ఇప్పటికే ఎంఓయూ కూడా కుదుర్చుకున్నామన్నారు. ఇప్పటికే అమరావతి క్వాంటం కంప్యూటింగ్ కంపెనీ (ఏక్యూసీసీ) ఏర్పాటు చేసి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నియామకాలు కూడా జరిగాయన్నారు. ఈ రంగంలో అపారమైన ఉపాధి, ఉద్యోగావకాశాలు రాబోతున్నాయని చెప్పారు.

