రాత్రీ పగలు.. పడిగాపులు

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : దేవుడు వ‌ర‌మిచ్చినా.. పూజారి క‌రుణించ లేద‌న్న చందంగా మారింది అన్న‌దాత ప‌రిస్థితి. ఈ ఏడాది విస్తారంగా వ‌ర్షాలు కురుస్తుండ‌టంతో రైతులు (Farmers) పంట‌లు అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. ఈ ఆనందంలో ఉన్న రైతుల‌కు యూరియా (Urea) క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. తెలంగాణ (Telangana)లో యూరియా కొర‌త కార‌ణంగా తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. రాత్రి ప‌గ‌లు అనే తేడా లేకుండా యూరియా కోసం పీఏసీఎస్ (పీఏసీఎస్‌)ల వ‌ద్ద బారులు తీరుతున్నారు. చంటి పిల్ల‌ల‌ను సైతం చంక‌లో ఎత్తుకొని వెళ్లి మ‌రీ మ‌హిళ‌లు క్యూలో నిల్చోవాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. పోనీ ఇంత‌గా ప‌డిగాపులు కాసినా స‌రిప‌డా యూరియా బ‌స్తాలు దొరుకుతాయా అంటే.. అదీ లేదు. ముందు వచ్చిన వారికే రెండు బ‌స్తాలు దొర‌క‌డం గ‌గ‌న‌మైంది. ఇక వెనుక‌కు వ‌స్తే ఉత్తి చేతుల‌తో వెళ్లిపోవాల్సిందే.

తుమ్మ‌ల ప్ర‌య‌త్నం.. తీర‌నున్న క‌ష్టాలు
అయితే… తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నెల‌కొన్న యూరియా స‌మ‌స్య‌ను మంత్రి తుమ్మల నాగేశ్వర రావు(Tummala Nageswara Rao) కేంద్ర ప్ర‌భుత్వం (Central Government) దృష్టికి తీసుకెళ్లారు. అదనంగా యూరియా కేటాయించాల‌ని తుమ్మల విజ్ఞప్తి చేశారు. దీనికి కేంద్రం అంగీకరించ‌డంతో త్వ‌ర‌లో రైత‌న్న‌ల యూరియా క‌ష్టాలు తీర‌నున్నాయి. ఇప్పటికే కేటాయించిన 40 వేలమెట్రిక్ టన్నులతో పాటు మరో 40 వేల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించింది. దీంతో తెలంగాణకు మొత్తం 80 వేల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది.

Leave a Reply