ఒకే కుటుంబమని అనుమానం
తిరుపతి జిల్లాలో కలకలం
( పాకాల, ఆంధ్రప్రభ): తిరుపతి జిల్లాలో భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. పాకాల మండలం పాకాలవారిపల్లిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతదేహాలు లభ్యమవడంతో కలకలం రేగింది. తల్లిదండ్రులు, ఇద్దరు చిన్నారులు మృతదేహాలు గుర్తించడం తీవ్ర కలకలం రేపుతోంది. శనివారం ఉదయం గ్రామానికి సమీపంలోని అటవీప్రాంతంలో పశువులను మేపుతున్న కాపరులు ఈ నాలుగు మృతదేహాలను చూసి భయాందోళనకు గురయ్యారు. వెంటనే గ్రామ పెద్దలకు, ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. శరీరాలు చెదిరిపోయిన స్థితిలో ఉండటంతో నాలుగు రోజుల కిందట మృతి చెందినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. మృతదేహాల పక్కన మద్యం బాటిళ్లు, మాత్రల కవర్లు, దుస్తులు, చెప్పులు కనిపించాయి. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కుటుంబ ఆత్మహత్యేనా?
బాధితులు ఒకే కుటుంబానికి చెందినవారని పోలీసులు అనుమానిస్తున్నారు. మద్యం బాటిళ్లు, మాత్రలు, వస్తువులు అక్కడే లభించడంతో ఆత్మహత్య కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్య అవకాశాన్ని కూడా విస్మరించకూడదని అధికారులు పేర్కొన్నారు. మృతదేహాలను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. వైద్యుల బృందం పోస్టుమార్టం నిర్వహించి మరణానికి గల ఖచ్చితమైన కారణాలను వెల్లడించనుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గ్రామస్థుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. బాధితుల వివరాలు పూర్తిగా తెలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకేసారి నాలుగు మృతదేహాలు బయటపడటంతో పాకాల మండలం, పరిసర గ్రామాల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. ఇలాంటి ఘటన ఇంతవరకు తమ గ్రామాల్లో జరగలేదరంటూ భయాందోళన వ్యక్తం చేశారు.

