సీఎం మనవడి అద్భుత కృషి
మంత్రి లోకేష్ తనయుడి అంకితభావం
చదరంగంలో అతివేగ చిరుత .. ఈ దేవాంశ్
( ఆంధ్రప్రభ, మంగళగిరి ప్రతినిధి)ఏపీ రాజకీయ చరిత్రలోనే.. నారా వటవృక్షంలో ఓ చిరుకొమ్మ పరిమళించింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు.. తాతను మించిన మనవడు ఎదుగుతున్నాడు. తెలుగు వల్లభుడు విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు ముది మనవడు.. ఏపీ మంత్రి నారా లోకేశ్ తనయుడు నారా దేవాంశ్..చదరంగ క్రీడలో నయా చరిత్ర సృష్టించాడు. ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు. చదరంగంలో పాదరస వేగంతో చెక్‌మేట్ సాల్వర్–175 పజిల్స్ సాధించాడు. చదరంగంలో అత్యంత క్లిష్టతర 175 పజిల్స్‌ను వ్యూహాత్మకంగా పావులను కదిపి 11 నిముషాల 59 సెకన్లలో పజిల్స్‌ను పూర్తి చేసి ప్రపంచ రికార్డును సాధించాడు. లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ హాల్‌లో జరిగిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డుల వేడుకలో చెస్ క్రీడలో అత్యుత్తమ అవార్డును దేవాంశ్‌కు నిర్వాహకులు అందజేశారు. గతంలో కూడా దేవాంశ్ రెండు ప్రపంచ రికారుల్డను సాధించారు. తనయుడు కైవశం చేసుకున్న ఈ రికార్డు పట్ల తండ్రి నారా లోకేష్ ఆనంద పరవశులయ్యారు. తన బిడ్డ దేవాంశ్ సాధించిన ఈ ఘనత ఎంతో గర్వకారణం అన్నారు. పదేళ్ల ప్రాయంలోనే తన ఆలోచనలకు పదును పెడుతూ ఒత్తిడిలోనూ ప్రశాంతంగా అంకిత భావంతో చెస్ నేర్చుకున్నాడని లోకేశ్ ప్రశంసించారు. దేవాంశ్ పడిన కష్టాన్ని, కఠోర శ్రమను ఓ తండ్రిగా దగ్గరుండి ప్రత్యక్షంగా చూశానని లోకేష్ వివరించారు. ఇప్పుడు దేవాంశ్ పడిన కష్టానికి దక్కిన ప్రతిఫలం చూసి ఎంతో ఆనందిస్తున్నట్లు పేర్కొన్నారు. మనవడి దేవాంశ్ రికార్డు పట్ల సీఎం చంద్రబాబు మురిసిపోయారు. 2025 వరల్డ్ రికార్డు అందుకున్నందుకు దేవాంశ్‌కు అభినందనలు తెలిపారు. నెలల తరబడి గురువుల మార్గదర్శనంలో పట్టుదలగా ఎంతో శ్రమించి దేవాంశ్ ఈ ఘనత సాధించాడని, అందుకు గర్విస్తున్నట్లు ఆనందం వ్యక్తం చేశారు. మా చాంపియన్‌కు శుభాకాంక్షలు అంటూ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు.

