ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ చంద్రగ్రహణం తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ఆలయాలు తెరుచుకున్నాయి. తిరుమల(Tirumala)లో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం తర్వాత సోమవారం(Monday) వేకువజామున 2.40 గంటలకు శ్రీవారి ఆలయ తలుపులను ఆలయ అధికారులు తెరిచారు. సుప్రభాత సేవను అర్చకులు ఏకాంతంగా నిర్వహించారు. తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు సర్వ దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 18 కంపార్టెమెంట్ల(18 compartments)లో భక్తులు వేచి ఉన్నట్లు అధికారులు తెలిపారు.

నంద్యాల(Nandyala) జిల్లా శ్రీశైలం(Srisailam) మల్లన్న ఆలయంలో చంద్రగ్రహణం(lunar eclipse) సంప్రోక్షణ పూజలు జరిపారు. సోమవారం ఉదయం 5 గంటలకు మల్లన్న ఆలయ ద్వారాలను అధికారులు తెరిచారు. ఆలయ శుద్ధి తర్వాత అర్చకులు స్వామివారికి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు.


విజయవాడ(Vijayawada) ఇంద్రకీలాద్రిపై ఉదయం 8.30 గంటల నుంచి భక్తులకు దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. సంప్రోక్షణ, పూజల తర్వాత అమ్మవారి దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు.


విశాఖపట్నం(Visakhapatnam) జిల్లా సింహాచల దేవస్థానం శ్రీవరాహ లక్ష్మీనరసింహ స్వామి(Lord Varaha Lakshmi Narasimha Swamy)కి చంద్రగ్రహణం అనంతరం సంప్రోక్షణ పూజలు నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి భక్తులకు దర్శనాలకు అనుమతి ఇస్తున్నట్లు ఆలయ సిబ్బంది తెలిపారు.


తెలంగాణ(Telangana) పుణ్యక్షేత్రాల్లో ఒకటి బాసర(Basara) సరస్వతీ అమ్మవారి ఆలయం. ఈ అమ్మవారి ఆలయంతో పాటు ఉప ఆలయాల్లో కవాటోద్ఘాటనం గణపతి పూజ నిర్వహించారు. వేకువజాము నుంచి మహా సంప్రోక్షణ, ఆలయ శుద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఆలయంలో యధావిధిగా తిరిగి అక్షరాభ్యాసాలు, ఆర్జిత సేవలు ప్రారంభమయ్యాయి.


యాదగిరిగుట్ట(Yadagirigutta) లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని అధికారులు తెరిచారు. తెల్లవారుజామున 3.30 గంటలకు ఆలయాన్ని తెరిచి అర్చకులు సంప్రోక్షణ చేశారు. నిత్య కైంకర్యాలు నిర్వహించి యథావిధిగా స్వామివారి దర్శనానికి భక్తులకు అనుమతి ఇచ్చారు.

Leave a Reply