ఆందోళన వద్దు.. అందరికీ ఇస్తాం
రైతులకు కృష్ణాజిల్లా కలెక్టర్ హామీ
(ఆంధ్రప్రభ, కృష్ణా ప్రతినిధి) : ఇటు పూర్తి స్థాయిలో యూరియా (Urea) దొరకటం లేదని రైతులు ఆందోళన చెందుతుంటే.. మరో వైపు ప్రతిపక్ష పార్టీ కూడా అన్నదాత పోరు (breadwinner’s fight) పేరిట ఆందోళనకు సర్వ సన్నద్ధమవుతున్న తరుణంలో.. కృష్ణాజిల్లా కలెక్టర్ బాలాజీ (Krishna District Collector Balaji) తీవ్రంగా స్పందించారు. జిల్లాలో యూరియ కొరత లేదు. కావాల్సినంత యూరియా నిల్వ ఉంది. మరి రైతులు ఎందుకు ఇబ్బంది పడుతున్నారో స్వయంగా తెలుసుకోవటానికి ఆదివారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రైతు బాట పట్టారు. ఆయనతో పాటు అధికార బృందాన్ని కూడా తీసుకువెళ్లారు.

గన్నవరం (Gannavaram) నియోజకవర్గంలోని గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు మండలాల్లో వివిధ గ్రామాల్లో కలెక్టర్ బాలాజీ ఆదివారం సుడిగాలి పర్యటన చేశారు. ఆయా గ్రామాల్లో రైతులతో ముఖాముఖి మాట్లాడారు. యూరియా స్థితిగతులపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. యూరియా సరఫరా నిరంతరం కొనసాగుతోందని, ఎలాంటి అపోహలు వద్దని జిల్లా కలెక్టర్ వివరించారు. ఇంకా యూరియా ను దిగుమతి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత ఏడాది ఇదే సమయానికి 27 వేల టన్నుల యూరియాను రైతులకు అందజేశామన్నారు. ఈ ఏడాది ఇప్పటికే అంతకు మించి యూరియాను రైతులకు (farmers) పంపిణీ చేశామన్నారు.

గన్నవరం మండలం పురుషోత్తపట్నం లో రైతులు నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, నక్క శ్రీనివాసరావు తదితరులు మాట్లాడుతూ తమ ప్రాంతంలో కొంతమందికి ఇప్పటి వరకు ఒక కోటా యూరియా కూడా రాలేదని, మరి కొంత మందికి రెండో కోటా రావాలని కలెక్టర్ కు వివరించారు. ఎకరాకు 3 కట్టల యూరియా అవసరముందని, కొంతమంది సాగు చేయని వారికి కూడా యూరియా పంపిణీ చేశారని ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ సోమ మంగళవారాల్లో మరిన్నియూరియా లోడ్ లు దిగుమతి అవుతాయని, వీటి నుంచి అందరికీ సరిపడా యూరియా అందజేస్తామన్నారు. ఎవరు కూడా ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలని కలెక్టర్ హామీ ఇచ్చారు.

అతిగా వాడితే పంటకే నష్టం
ప్రస్తుతం జిల్లాలో యూరియా నిల్వ అందుబాటులో ఉన్నాయని ఇంకా అవసరాన్ని బట్టి ఎప్పటి కప్పుడు యూరియాను జిల్లాకు తెప్పిస్తున్నామన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు (agricultural scientists) చెప్పినట్లుగా ఎకరాకు రెండు బస్తాల యూరియా సరిపోతుందనీ, అంతకు మించి వినియోగిస్తే పంట నష్టపోవడమే కాకుండా భూసారం కూడా దెబ్బతింటుందని కలెక్టర్ రైతులకు వివరించారు. ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లో రైతులకు యూరియా పంపిణీ పరిశీలించారు. పెదవుటుపల్లి గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ మెగా అవుట్రిచ్ కార్యక్రమం సజావుగా జరిగిందా లేదా అని జిల్లా కలెక్టర్ ఆరా తీశారు.

యూరియా సరఫరాపై సచివాలయ (Secretariat) సిబ్బంది ఇంటింటికి వచ్చి వివరించి ఆందోళన చెందవద్దని చెప్పారా లేదా అని రైతులను అడిగారు. ఇక జిల్లా కలెక్టర్ కూడా ఇంటింటికి వెళ్లి రైతులు మరీదు శివయ్య భార్య నాగమణి, పడమట శ్రీదేవి, సింహాద్రి సుబ్బారావు లతో ముఖాముఖి మాట్లాడారు. తదనంతరం బాపులపాడు మండలం వీరవల్లి, కానుమోలు గ్రామాల్లో కూడా జిల్లా కలెక్టర్ రైతుల ఇంటింటికి తిరిగి ఔట్రీచ్ కార్యక్రమాన్నీ సచివాలయ సిబ్బంది సరిగా నిర్వహించారా లేదా అని రైతులను ప్రశ్నించారు.
కాజ్ వే .. బాగు చేయించండి సారూ..
పురుషోత్తపట్నంలో కొండ పావులూరు గ్రామం వెళ్లే మార్గంలో ఊర చెరువు నుండి నీరు పొంగి లో లెవెల్ కాజ్ వే నీరుపారుతోందని, దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందని గ్రామస్తులు వాపోయారు. కాజ్ వే పై ద్విచక్ర వాహనాలు (two-wheelers) జారి పడిపోతున్నారని, దెబ్బలు తగులుతున్నాయని, ఈ ప్రమాదాలను నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. ఇక పురుషోత్తపట్నంలో ముస్తాబాద్ (Mustabad) వెళ్లే ఆర్ అండ్ బీ రోడ్డు పక్కనే కాలువ మట్టి కోతకు గురైందని, రానున్న రోజుల్లో ఈ రోడ్డు దెబ్బ తినే అవకాశం ఉందని గ్రామానికి ఓ నాయకుడు మోహన్ రావు జిల్లా కలెక్టర్ కు వివరించారు.

జిల్లా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట గుడివాడ ఆర్డీవో జి బాలసుబ్రమణ్యం, మార్క్ ఫెడ్ జిల్లా మేనేజర్ మురళీ కిషోర్, గన్నవరం వ్యవసాయ శాఖ ఏడి సునీల్ కుమార్, గన్నవరం, తహసీల్దారు శివయ్య, ఉంగుటూరు ఎంపీడీవో ప్రసాద్, బాబులపాడు తహసిల్దారు మురళీకృష్ణ, మండల వ్యవసాయ అధికారి శివప్రసాద్, పురుషోత్తం పట్నం సర్పంచ్ మాదాల రోహిణి, పెదవుటుపల్లి సొసైటీ కార్యదర్శి లోకేశ్వరి వి ఏ నాగేంద్రబాబు పాల్గొన్నారు.