- కర్నూలు జిల్లా కలెక్టర్ వినూత్న ప్రోగ్రామ్
( ఆంధ్రప్రభ, కర్నూలు ) : పల్లెకు పోదాం అనే వినూత్న కార్యక్రమాన్ని కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా శనివారం ప్రారంభించారు. మండలానికి 3 గ్రామాల చొప్పున 79 గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో పల్లెకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో పాఠశాలలు, అంగన్వాడీ సెంటర్లు, హాస్పిటల్స్, హాస్టల్స్, రైతు సేవా కేంద్రాలు, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు తదితర ప్రభుత్వ సంస్థలను తనిఖీ చేశారు.
రోడ్లు, నీటి సరఫరా, ఇళ్ళ నిర్మాణాలు తదితర అంశాలను కూడా పరిశీలించారు..ఆయా గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులను, పరిష్కరించాల్సిన సమస్యలను పల్లెకు పోదాం ఆన్ లైన్ వెబ్ సైట్ లో పొందుపరిచారు..వీటిని పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు..
పర్ల గ్రామంలో.. తనిఖీలు
కల్లూరు మండలం పర్ల గ్రామంలో పల్లెకు పోదాం కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పాల్గొని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఓ హెచ్ ఆర్ ఎస్, అంగన్వాడీ కేంద్రం,ఆస్పత్రి, గ్రామ సచివాలయం, సాంఘిక సంక్షేమ ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొన్ని సమస్యలను గుర్తించి, పనులను మంజూరు చేశారు.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కాంపౌండ్ వాల్, కిచెన్ షెడ్ నిర్మాణాలకు మంజూరు చేశారు. గ్రామ సచివాలయం ఎదురుగా, అంగన్వాడీ కేంద్రం ఎదురుగా రోడ్లు బాగాలేకపోవడంతో సిమెంట్ రోడ్లు మంజూరు చేశారు.. అలాగే సాంఘిక సంక్షేమ ప్రభుత్వ బాలుర వసతి గృహంలో నిర్మాణంలో ఆగిపోయిన భవనాలను పూర్తిచేస్తామని తెలిపారు..పర్ల నుండి చిన్న టేకూరు, సింగవరం వెళ్ళే ఆర్ అండ్ బి రోడ్డు పై ఉన్న కల్వర్టు బ్రిడ్జి నిర్మాణాన్ని కూడా మంజూరు చేశారు.
బడిలో పిల్లలతో మాటామంతీ
తొలుత జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి, కిచెన్ షెడ్, టాయిలెట్స్, నీటిసరఫరాను పరిశీలించారు. కిచెన్ షెడ్ బాగోలేదని, బాగు చేయిస్తామని తెలిపారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం నాణ్యత, రుచిగా అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.టాయిలెట్స్ ను శుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు.. అనంతరం. పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడారు..కేవలం 5 నెలలు మాత్రమే సమయం ఉందని, ప్రతి ఒక్కరూ బాగా చదువుకొని ఖచ్చితంగా 10 వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని జిల్లా కలెక్టర్ విద్యార్థులకు సూచించారు… యూనిఫాం , షూస్ కిట్స్ వచ్చాయా, మిడ్ డే మీల్స్ రుచిగా ఉందా, ఏ ఏ రోజులలో కోడిగుడ్డు ఇస్తున్నారు, ఉపాధ్యాయులు ఏవిధంగా పాఠాలు చెప్తున్నారు, అర్థమయ్యే రీతిలో పాఠాలు చెబుతున్నారా అని విద్యార్థులతో ఆరా తీశారు.. విద్యార్థులు అన్నీ బాగున్నాయని సమాధానం ఇచ్చారు..
తాగునీటి పరఫరాపై నజర్
ఓవర్ హెడ్ స్టోరేజ్ ట్యాంక్ ను పరిశీలిస్తూ ప్రతి రోజు క్లోరినేషన్ పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ని ఆదేశించారు… నీటి లో క్లోరిన్ శాతం ఎంత ఉందని కలెక్టర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో పరీక్షలు చేయించారు. పరీక్షకు సక్రమంగా చేయలేదని ఇంజనీరింగ్ అసిస్టెంట్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓవర్ హెడ్ స్టోరేజ్ ట్యాంక్ కి మరమ్మతులు చేయించాలని ప్రజలు కలెక్టర్ దృష్టికి తీసుకొని రాగా అందుకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు..
ఈ క్రాప్ బుకింగ్ పై ఆరా
గ్రామంలో ఈ క్రాప్ బుకింగ్ శాతం తక్కువగా ఉందని, పురోగతి తీసుకొని వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, అదే విధంగా సెప్టెంబర్ చివరి నాటికి ఈ క్రాప్ బుకింగ్ పూర్తి చేయాలని కలెక్టర్ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ను ఆదేశించారు..అన్నదాత సుఖీభవ కి సంబంధించి గ్రీవెన్స్ లు ఏమైనా పెండింగ్ లో ఉన్నాయా అని కలెక్టర్ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ను అడిగి తెలుసుకున్నారు.. ప్రతి రోజు వచ్చిన గ్రీవెన్స్ లు బియాండ్ ఎస్ఎల్ఏ కు వెళ్లకుండా, గడువు లోపు పరిష్కరించాలని డిజిటల్ అసిస్టెంట్ ను ఆదేశించారు.
తల్లికి వందనం కు సంబంధించి ఏమైనా గ్రీవెన్స్ లు పెండింగ్ లో ఉన్నాయా? అని కలెక్టర్ వెల్ఫేర్ అసిస్టెంట్ ను ఆరా తీశారు.. క్లోరినేషన్ పరీక్షలకు సంబంధించి టెస్ట్ కిట్ ఎక్స్పైర్ అయిన విషయం చెప్పకుండా ఉన్నందుకు, కిట్ తెప్పించుకోకుండా ఏమి చేస్తున్నారని, పరీక్షలు చేయకపోతే ప్రజలకు ఏమైనా సమస్య అయితే ఎలా అని కలెక్టర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పని తీరు మీద ఆగ్రహం వ్యక్తం చేశారు.. వెంటనే ఇద్దరు ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు షో కాజ్ నోటీసులు జారీ చేసి ఎక్స్ప్లనేషన్ కోరాలని కలెక్టర్ ఎంపిడిఓ ను ఆదేశించారు.. లైవ్ స్టాక్ ఎంత ఉందని కలెక్టర్ పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ ను ఆరా తీశారు… వ్యాక్సినేషన్ వేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ ను ఆదేశించారు.
గ్రామస్తులతో ముఖాముఖీ
అనంతరం గ్రామస్థులతో మాట్లాడారు.. పెన్షన్ వస్తోందా, ఇంటి దగ్గరికే వచ్చి ఇస్తున్నారా, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు వచ్చాయా అంటూ ఆరా తీశారు. అన్నీ వచ్చాయని గ్రామస్థులు తెలిపారు.. పెన్షన్లు లేని వారు కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు చేసుకోవాలని, ఇల్లు, ఇంటి స్థలం లేని వారు కూడా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ గ్రామస్తులకు సూచించారు. పెన్షన్ల కోసం, ఇల్లు, ఇళ్ల స్థలాలు కావాలన్న వారి నుండి దరఖాస్తులు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు..
అంగన్ వాడీ కేంద్రాల్లో..
గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలిస్తూ పిల్లలకు మెనూ ప్రకారం నాణ్యతతో కూడిన పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ అంగన్వాడీ సిబ్బందిని ఆదేశించారు… పిల్లలకు నాణ్యమైన భోజనం అందిస్తున్నారా? టాయిలెట్ సదుపాయం ఉందా? అనే అంశాలను చూశారు. పిల్లలకు రైమ్స్, టేబుల్స్ వంటి ప్రాథమిక విద్య సామాగ్రి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే మండల ఫండ్స్ ద్వారా మరమ్మత్తులో ఉన్న అంగన్వాడీ భవనాన్ని త్వరితగతిన పూర్తి చేసి, పిల్లలకు అనుకూల వాతావరణం కల్పించాలంటూ కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు…
వైద్య సేవలపై ఆరా
ఆయుష్మాన్ భారత్ హెల్త్ వెల్నెస్ కేంద్రం (విలేజ్ క్లినిక్-2) ను తనిఖీ చేసి సిబ్బంది పనితీరును పరిశీలించారు. క్లినిక్‌లో వైద్యం కోసం వచ్చిన అక్కమ్మ (60)తో కలెక్టర్ మాట్లాడుతూ ఆస్పత్రిలో మంచి వైద్య సేవలు అందుతున్నాయా, మందులు బాగానే ఇస్తున్నారా ? అని ప్రశ్నించారు.. నాకు కొద్ది రోజులుగా బీపీ సమస్య ఉందని మందులు తీసుకోవడానికి ఇక్కడికే వస్తానని సిబ్బంది చాలా బాగా చూసుకుంటారన్నారు.. రోజువారీగా క్లినిక్‌కు ఎన్ని ఓపి లు వస్తాయి? ఎన్ని రకాల ల్యాబ్ టెస్టులు నిర్వహిస్తున్నారు? గ్రామంలో ప్రస్తుతం ఎంతమంది గర్భిణీ స్త్రీలు ఉన్నారు? హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు ఎంతమంది ఉన్నారు? వారి ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నారా లేదా? అని కలెక్టర్ క్లినిక్ సిబ్బందిని ఆరా తీశారు. క్లినిక్ సిబ్బంది అందిస్తున్న సేవలకు కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.. గ్రామ ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ వైద్య సిబ్బందిని ఆదేశించారు..
విద్యార్థుల సంక్షేమే లక్ష్యం
సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి హాస్టల్లోని స్టోర్ రూమ్, గదులు, వసతి సదుపాయాలను పరిశీలించి, విద్యార్థుల సంఖ్య, వారికి అందుతున్న భోజనం, ఆరోగ్య సదుపాయాలు, పాఠశాల హాజరు వంటి అంశాలపై కలెక్టర్ సంబంధిత అధికారులను ఆరా తీశారు. వసతి గృహం కోసం నిర్మిస్తూ, ఆగిపోయిన అసంపూర్ణ భవనాన్ని నిర్మిస్తామని కలెక్టర్ అధికారులకు తెలిపారు. విద్యార్థుల సంక్షేమం కోసం అధికారులు మరింత శ్రద్ధ చూపాలని సూచించారు.
పత్తి పంట స్థితి గతిపై పరిశీలన
పత్తి పంటను పరిశీలించి, రైతులతో ముచ్చటించారు. పంట పరిస్థితులు, పెట్టుబడి ఖర్చులు, దిగుబడి, విక్రయాలు వంటి అంశాలపై కలెక్టర్ వివరాలు తెలుసుకున్నారు. కలెక్టర్ మిన్నల అనే రైతుతో మాట్లాడుతూ ఎన్ని ఎకరాల్లో పత్తి పొలం సాగు చేస్తున్నారు? ఎకరాకు ఎంత ఖర్చు అవుతోంది? పత్తి దిగుబడి ఎలా ఉంది? వ్యవసాయ శాఖ అధికారులు వచ్చి ఈ క్రాప్ నమోదు చేశారా? అని ప్రశ్నించారు. దీనికి రైతు స్పందిస్తూ 7 ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నాము.
ఈసారి వర్షాలు బాగా కురవడంతో పంట బాగా ఉంది. ఎకరాకు సుమారు రూ 40వేల వరకు ఖర్చు అవుతోంది. పత్తిని ఆదోని లేదా నాగలాపురం మార్కెట్లలో విక్రయిస్తాము. వ్యవసాయ శాఖ అధికారులు పొలానికి వచ్చి ఈ క్రాప్ నమోదు చేశారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కల్లూరు ఎంపిడిఓ జి. ఎన్.ఎస్ రెడ్డి, డిప్యూటీ తహసిల్దార్ విష్ణు వర్ధన్ పాల్గొన్నారు.






