లారీల అడ్డగింత ..
నడిరోడ్డుపై గడ్డి దహనం
రైల్వే కోడూరులో ఉద్రిక్తత
దళారీ సిండికేట్ పై ఆగ్రహం
( ఆంధ్రప్రభ, అన్నమయ్య బ్యూరో)
దళారులు తమను దోచేస్తున్నారని అన్నమయ్య జిల్లా బొప్పాయి రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన బాట పట్టారు. సమ్మెకు దిగారు. శుక్రవారం ఉదయం నుంచి గ్రామాల్లో బొప్పాయి లారీలను రైతులు అడ్డుకున్నారు. రోడ్లపై వరి గడ్డిని దహనం చేశారు. అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ ఆదేశాలను కూడా పట్టించుకోకుండా దళారీలు రైతులను మోసం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీస మద్దతు ధర ప్రకటించే వరకు సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 15,000 ఎకరాల బొప్పాయి తోటలు ఉత్పత్తి చేసాయి. గత ఒకటిన్నర నెలలుగా గిట్టుబాటు ధర లేకుండా, దళారులు సిండికేట్ ఏర్పడి 16 రూపాయల నుండి 7 రూపాయల వరకు తగ్గించారు. ఇక రైతులు తట్టుకోలేక ఆందోళనకు దిగారు. జిల్లా కలెక్టర్ మధ్యవర్తిత్వం వహించి ఆగస్టు 1–5 వరకు 9 రూపాయలు, 6వ తేదీ నుంచి 10 రూపాయలు అమలు చేయాలని ఆదేశించారు. కానీ దళారుల్లో మార్పు రాలేదు. తిరిగి 7 రూపాయలకు తగ్గించటంతో రైతులు మళ్లీ రోడ్లపైకి వచ్చారు. సబ్ కలెక్టర్ హెచ్చరించిన తరువాత రైతులు కొద్ది రోజుల పాటు 9 రూపాయల వద్ద సంతృప్తి చెందగా, ఆగస్టు 26న ధరను 5 రూపాయలకు తగ్గించడం రైతులను మరింత ఆగ్రహపరిచింది.కనీసం 15 రూపాయల గిట్టుబాటు ధర కల్పించి తమ పెట్టుబడికి న్యాయం కావాలని డిమాండ్ చేస్తున్నారు.

