హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాజకీయంగా భిన్నాభిప్రాయాలను పక్కన పెట్టి తెలుగు వాడైన ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కోరారు. ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి (Vice President Candidate) పరిచయ కార్యక్రమం ఈ రోజు తాజ్ కృష్ణ హోటల్ (Taj Krishna Hotel)లో జరిగింది. అనంతరం మీడియాతో సీఎం మాట్లాడుతూ ఇండియా కూటమి ఆలోచనను సుదర్శన్ రెడ్డి గౌరవించారని చెప్పారు.
ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నిక (Vice-Presidential Election) కు అంత్యంత ప్రాధాన్యత ఉందని, రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేయాలనే ఎజెండాతో ఎన్డీయే అభ్యర్థిని పెట్టిందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఇండియా కూటమి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని బరిలోకి దింపినట్లు చెప్పారు. ఎన్నికలు, రాజకీయాలు, వివాదాలపై ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చునని, సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మాజీ సీఎం కేసీఆర్, జగన్, ఎంఐఎం అధ్యక్షుడు అక్బరుద్దీన్ ఒవైసీలకు ఆయన విజ్ఞప్తి చేశారు.