- పోలీసు అదుపులో కేటీఆర్, హరీశ్‌రావు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : అన్నదాతలు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ , యూరియా కొరత (Urea Shortage) లేకుండా చూడాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయ శాఖ కమిషనర్ వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ (KTR), మాజీ మంత్రులు బీఆర్ఎస్ నేతలు హరీశ్‌రావు, నిరంజన్ రెడ్డి (NiranjanReddy) తోపాటు పలువురు ఎమ్మెల్యేలు బైఠాయించారు. అంతకు ముందు రైతు సమస్యలు, పంట నష్టం, యూరియా కొరతపై వ్యవసాయ శాఖ కమిషనర్‌కు బీఆర్ఎస్ నేతలు (BRS leaders) వినతిపత్రం అందజేశారు. దీంతో కేటీఆర్, హరీశ్రావు, నిరంజన్ రెడ్డితోపాటు పార్టీ ఎమ్మెల్సీలు, నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం వల్లే..
అంతకుముందు బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు (HarishRao) మాట్లాడుతూ ఏ రాష్ట్రాల్లోనూ యూరియా సమస్య లేదని, ఒక్క తెలంగాణలోనే మాత్రమే ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం వల్లే.. తెలంగాణాలో యూరియా కొరత ఏర్పడిందని చెప్పారు. గత ప్రభుత్వంలో కరోనా సమయంలోనూ ఇబ్బంది లేకుండా పంపిణీ చేసినట్లు వివరించారు. బీజేపీ, కాంగ్రెస్ (BJP, Congress) ఒకరిపై ఒకరు నెపం వేసుకొని తప్పించుకుంటున్నారని దుయ్యబట్టారు యూరియా పంపిణీ చేతకాకపోతే తప్పుకోవాలన్నారు. తాము రాజకీయాల కోసం రాలేదని.. రైతుల కోసం వచ్చినట్లు పేర్కొన్నారు. యూరియా కోసం వెళ్తే రైతులపై దాడి చేస్తున్నారని నిరంజన్ రెడ్డి (NiranjanReddy) విమర్శించారు. కొరత సమస్య ఒక్కరోజైనా సమీక్ష చేశారా అని ప్రశ్నించారు.
