ఆంధ్రప్రభ, కర్నూలు బ్యూరో : దీర్ఘకాలంగా నడిచిన ఓ హత్య కేసుకు న్యాయస్థానం తెరదించింది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. ఆటో డ్రైవర్‌ను దారుణంగా హత్య చేసిన కేసులో.. రౌడీ షీటర్ బోయ తోట శివకు జిల్లా ప్రధాన న్యాయస్థానం జీవిత ఖైదు శిక్షను ఖరారు చేసింది. ఈ కేసును విచారించిన ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి తోట శివకు జీవిత ఖైదుతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.
2017 నవంబర్ 19వ తేదీ సాయంత్రం 7.30 గంటల సమయంలో జామియా మసీదు వద్ద టీ హోటల్‌లో ఆటో డ్రైవర్ అజంఖాన్ సలాంబాష్ (38)పై, తగాదాల నేపథ్యంలో బోయ తోట శివ కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. అజంఖాన్ సలాంబాష్ అన్న అజంఖాన్ శాలిభాష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్ఐ, ప్రస్తుత కర్నూలు రూరల్ సీఐ ఎం. చంద్రబాబు నాయుడు క్రైమ్ నెంబర్ 244/2017 కింద కేసు నమోదు చేశారు.
అప్పటి ఇన్‌స్పెక్టర్లు ఏ. శ్రీనివాసులు, సి. మహేశ్వరరెడ్డి, పి. నాగరాజు యాదవ్‌లు కేసు దర్యాప్తు నిర్వహించి నిందితుడిపై చార్జ్‌షీట్ దాఖలు చేశారు. అనంతరం కోర్టులో సాక్షుల వాంగ్మూలాలు రుజువయ్యాయి.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. కబర్ధి, నిందితుడు బోయ తోట శివపై ఆరోపణలు నిర్ధారణ కావడంతో.. ముద్దాయిగా తేల్చి జీవిత ఖైదు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధించారు. ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి. వెంకటరామిరెడ్డి ప్రాసిక్యూషన్ తరఫున వాదనలు వినిపించారు.
ఈ కేసు విచారణలో కీలక పాత్ర పోషించిన కర్నూలు డీఎస్పీ జె. బాబుప్రసాద్, రూరల్ సీఐ ఎం. చంద్రబాబు నాయుడు, ఓర్వకల్లు ఎస్ఐ యు. సునీల్ కుమార్, అలాగే సాక్షులను కోర్టులో హాజరుచేసిన సిబ్బంది పీసీ 3196 కె. మద్దిలేటి, హెచ్‌సి 1770 వి. నాగరాజు, హెచ్‌సి 2715 వై. శివప్రసాద్ రెడ్డిలను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రత్యేకంగా అభినందించారు.