ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: పిఠాపురం శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి దేవస్థానంలో జనసేన పార్టీ (Janasena) ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక వరలక్ష్మి (Varalakshmi) వ్రతాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పాదగయ పుణ్యక్షేత్రం నుండి పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు తరలివచ్చారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సతీమణి, వారాహి విజయ యాత్రలో కీలక పాత్ర పోషిస్తున్న నాగబాబు సతీమణి ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. మహిళా భక్తులతో కలిసి వ్రతంలో పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాగబాబు సతీమణి మాట్లాడుతూ.. మహిళలు సుఖసంతోషాలతో, ఐశ్వర్యంతో జీవించాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ తరపున ఈ సామూహిక వ్రతాలను ఏర్పాటు చేశామని అన్నారు. సమాజంలో మహిళలకు ఉన్నత స్థానం కల్పించడం, వారి సంక్షేమానికి పాటుపడటం జనసేన లక్ష్యమని ఆమె వివరించారు.
పూజా కార్యక్రమాల అనంతరం.. ఈ వ్రతంలో పాల్గొన్న మహిళా భక్తులకు చీర, కుంకుమ, ప్రసాదం కిట్లను పంపిణీ చేశారు. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తోడ్పడ్డారు. ఈ సామూహిక వ్రతాల నిర్వహణతో, జనసేన పార్టీ ప్రజలకు ఆధ్యాత్మికంగా మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తోందని పలువురు అభిప్రాయపడ్డారు.