ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దక్షిణ ఒడిస్సా, దానికి అనుకొని ఉన్న ఉత్తరాంధ్ర కోస్తా తీర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతుంది. వీటి ప్రభావంతో ఈ రోజు (ఆగస్ట్ 16) తెలంగాణ లోని ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కొమరంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, వరంగల్ జిల్లాలలో అక్కడక్కడ అతి భారీ వర్షాలు (heavy rains) కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.
అతి భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణలోని 12 జిల్లాలకు వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలెర్ట్ (orange alert) జారీ చేసింది. ఈ రోజు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, జనగాం, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాదాపు 8 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈ రోజు, రేపు తెలంగాణలోని అన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.