ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

నంద్యాల జిల్లా (Nandyal district)లోని ఆళ్లగడ్డ (Allagadda) సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో (road accident) ముగ్గురు మరణించగా, 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం తెల్లవారుజామున ఆళ్లగడ్డలోని ఆల్ఫా ఇంజినీరింగ్ కళాశాల దగ్గర రెండు ప్రైవేట్ ట్రావెల్ బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ‘జగన్ ట్రావెల్స్’ బస్సును ‘శ్రీకృష్ణ ట్రావెల్స్’ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టిందని ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ తెలిపారు. ఈ దుర్ఘటనలో గాయపడిన 26 మందిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. క్షతగాత్రులను వెంటనే మూడు అంబులెన్స్‌లలో ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మెరుగైన చికిత్స కోసం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

Leave a Reply