పాన్ ఇండియా సినిమా కాన్సెప్ట్‌కి బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ వంటి చిత్రాలు ఊపునిచ్చిన తర్వాత, టాలీవుడ్ హీరోలు బాలీవుడ్ మార్కెట్‌పై కన్నేసారు. అయితే అది మన తెలుగు స్టార్లకు పెద్దగా కలిసిరావడం లేదు. అయితే, ఈ కష్టం ఇప్పటిది కాదు… పాన్ ఇండియా పదం పుట్టకముందే మన హీరోలు హిందీ ప్రేక్షకుల మనసు గెలుచుకోవాలనే లక్ష్యంతో ముంబై ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అయితే, ఈ ప్రయాణం అందరికీ సాఫీగా సాగలేదని బాక్సాఫీస్ రికార్డులు చెబుతున్నాయి. మొదటి అడుగులోనే విజయాన్ని అందుకున్న వారు తక్కువ, ఆ విజయాన్ని నిలబెట్టుకున్న వారు మరీ తక్కువ. ఈ క్రాస్ ఓవర్ జర్నీ ఎలా సాగిందో ఒక్కొక్కరిది పరిశీలిద్దాం.
మెగాస్టార్ చిరంజీవి
1990లో చిరంజీవి హిందీ ప్రేక్షకులకు పరిచయమైన చిత్రం ప్రతిబంధ్. ఇది ఆయన సూపర్‌హిట్ తెలుగు చిత్రం అంకుశంకు రీమేక్. అప్పట్లో హిందీ ప్రేక్షకులు చిరంజీవి యాక్షన్, స్క్రీన్ ప్రెజెన్స్‌కి ఫిదా అయ్యారు. సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది. బాంబే లోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఫస్ట్ డే ఫస్ట్ షో హౌస్‌ఫుల్ బోర్డులు వెలిశాయి. ఆ యాక్షన్, ఆ డైలాగ్ డెలివరీ, ఆ ఆరా… “సౌత్‌లో స్టార్ అని విన్నాం, ఇప్పుడు ముంబైలో నిజమని చూసాం” అని అప్పటి మాధ్యమాలు రాశాయి. అయితే, ఈ విజయాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో వచ్చిన జెంటిల్మన్ మాత్రం ఘోర పరాజయం పొందింది. సబ్జెక్ట్, స్క్రీన్‌ప్లే, మ్యూజిక్ ఏది ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఫలితంగా మెగాస్టార్ హిందీ సినిమాల్లో మరింత స్థిరపడాలనే కల నెరవేరలేదు.
రామ్ చరణ్ కు నిరాశ
రామ్ చరణ్ బాలీవుడ్ ఎంట్రీ 2013లో విడుదలైన జంజీర్ రీమేక్. బాలీవుడ్ మార్కెట్‌లో రామ్ చరణ్‌కి మంచి అవకాశమని భావించారు. కానీ, 70ల సూపర్‌హిట్‌ను రీడిఫైన్ చేయాలన్న యత్నం, పాత ఫ్రేమ్‌లో కొత్త పెయింట్ వేసినట్టే అయిపోయింది. డైరెక్షన్ లోపాలు, బలహీనమైన స్క్రీన్‌ప్లే కారణంగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కుప్పకూలింది. పాజిటివ్ రివ్యూల కోసం ఎదురుచూసిన టీమ్‌కు, మొదటి రోజు నుంచే నెగటివ్ టాక్ ఎదురైంది. ఈ ఫ్లాప్ తర్వాత రామ్ చరణ్ హిందీ సిల్వర్ స్క్రీన్‌ను రెండోసారి టచ్ చేయకపోయాడు.
రానా దగ్గుబాటి – మిశ్రమ ఫలితాలు..
రానా దగ్గుబాటి 2011లో దమ్ మారో దమ్ తో హిందీ ప్రేక్షకులకు పరిచయమయ్యారు. స్టార్ కాస్ట్ ఉన్నప్పటికీ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. అయితే, 2015లో అక్షయ్ కుమార్‌తో నటించిన బేబీ మాత్రం రానాకు హిందీ మార్కెట్లో గుర్తింపు తెచ్చింది.
బేబీ సినిమా బాక్సాఫీస్ వద్ద భాకీ వసూళ్లు రాబట్టి కమర్షియల్ హిట్‌గా నిలిచింది. రానా యాక్టింగ్, ఇన్టెన్స్ రోల్స్ చేయగల సామర్థ్యాన్ని బాలీవుడ్ గుర్తించింది. అయినప్పటికీ, ఆ తరువాత ఆయన హిందీ ఫిల్మ్స్‌లో పెద్దగా యాక్టివ్‌గా లేరు.
వెంకటేష్ అరుదైన విజయకథ..
హిందీ డెబ్యూట్‌లో విజయం సాధించిన కొద్దిమంది టాలీవుడ్ హీరోల్లో వెంకటేష్ ఒకరు. 1993లో వచ్చిన అనారీ హిందీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. తమిళ బ్లాక్‌బస్టర్ చిన్న తంబి రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా, ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఆకట్టుకుంది.
అయితే ఈ విజయానంతరం వెంకీ మామ మళ్లీ బాలీవుడ్ సినిమాల్లో కనిపించలేదు. ఇటీవలి కాలంలో రాణా నాయుడు వెబ్ సిరీస్‌తో హిందీ కంటెంట్‌కి తిరిగి వచ్చినా.. ఇది మాత్రం తెలుగు ఫ్యాన్స్‌ని కాస్త కలవరపెట్టింది. ఈ సిరీస్ లో వెంకటేష్ కు ఉన్న ఫ్యామిలీ హీరో ఇమేమ్ కి బిన్నంగా చూపించడంతో, తెలుగు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది.
ప్రభాస్ కి వరుస ఫ్లాపులు
‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌కి హిందీ ప్రేక్షకుల్లో ఏర్పడిన క్రేజ్ అంతా ఇంతా కాదు.. ఈ సినిమా ద్వారా పాన్ ఇండియా మార్కెట్ ఓపెన్ చేసిన ప్రభాస్, హిందీ మార్కెట్లో మరింత బలమైన ఫ్యాన్ బేస్ ఏర్పరచుకోవాలనుకున్నాడు. కానీ, ఆ హైప్‌ని క్యాష్ చేసుకోవడంలో మాత్రం విఫలమయ్యారు.
సాహో సినిమాతో మొదలై.. రాధే శ్యామ్, ఆదిపురుష్ భారీ అంచనాలతో రిలీజ్ అయినా, బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. ముఖ్యంగా ఆదిపురుష్ కంటెంట్, డైలాగ్స్, విజువల్స్ కారణంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.
జూనియర్ ఎన్టీఆర్ కు తప్పని సవాల్ !
ఆర్‌ఆర్‌ఆర్‌తో హాలీవుడ్ దాకా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌తో కలిసి నటించిన వార్ 2 ద్వారా హిందీ సినిమాల్లో అడుగు పెట్టారు. ఈ సినిమా రిలీజ్ కు ముందు భారీ హైప్ సాధించింది. కానీ రిలీజ్‌కి వచ్చేసరికి, క్రిటిక్స్ టాక్ మిక్స్‌డ్‌గా ఉండటంతో, బాక్సాఫీస్ వసూళ్లు తడబడుతున్నాయి. హిందీ ప్రేక్షకులు.. “ఎన్టీఆర్ స్క్రీన్‌పై ఎనర్జీ మాత్రం తారస్థాయిలో ఉంది” అని మెచ్చుకున్నా, డైరెక్టర్ అయాన్ ముకర్జీ మార్క్, మ్యాజిక్ మాత్రం కనిపించలేదని, మొత్తం మీద అంచనాలకు తగ్గ ఫలితం రాలేదని వ్యాఖ్యానిస్తున్నారు.
విజయవంతమైన పాన్ ఇండియా చిత్రాలున్నప్పటికీ, హిందీ మార్కెట్లో మాత్రం మన స్టార్ హీరోలు నిలదొక్కుకోలేకపోతున్నారు. అయితే, తొలి అడుగులోనే హిట్ కొట్టిన వెంకటేష్, చిరంజీవి వంటి హీరోలు కూడా దీర్ఘకాల విజయాన్ని సాధించలేకపోవడం దీని నిదర్శనం.