కృష్ణా నదిలో వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి భారీగా నీరు చేరడం వల్ల వరద ప్రవాహం మరింత పెరిగింది. ఈ వరద నీరు జూరాల (ప్రియదర్శిని జూరాల) ప్రాజెక్టుకు చేరడంతో, అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

**తాజా సమాచారం ప్ర‌కారం సాయంత్రం 6 గంటల వరకు ప్రాజెక్టులో నీటి మట్టం *317.680 మీటర్లు (1,042.257 అడుగులు)* వద్ద ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టం (FRL) 318.516 మీటర్లు, ప్రాజెక్టు స్థూల సామర్థ్యం 7.991 టీఎంసీలు, లైవ్ స్టోరేజ్ 4.284 టీఎంసీలుగా నమోదైంది.

ఇన్‌ఫ్లో 90,000 క్యూసెక్కులు ఉండగా, 54,352 క్యూసెక్కులు నీటిని స్పిల్‌వే ద్వారా 8 గేట్ల ద్వారా విడుదల చేస్తున్నారు. 36,628 క్యూసెక్కులు నీటిని పవర్ హౌస్ ద్వారా విడుదల చేస్తున్నారు.

అదనంగా కోయిలసాగర్ లిఫ్ట్ ద్వారా 315 క్యూసెక్కులు, ఆర్‌డీఎస్ లింక్ కాల్వ ద్వారా 50 క్యూసెక్కులు నీరు వెళ్తోంది. మొత్తం కలిపి ప్రాజెక్టు నుంచి 91,340 క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు.

వరద ప్రవాహం కొనసాగుతున్నందున అధికారులు పర్యవేక్షణను కఠినతరం చేశారు. ప్రాజెక్టు దిగువ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని సూచించారు.

Leave a Reply