తగ్గేదేలే…
ఆంధ్రప్రభ డెస్క్ : కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు మంగళవారం జరిగిన ఉప ఎన్నికలు ఏపీలో సంచలనంగా మారాయి. ఘర్షణలు, నిరసనలు సినిమాలోని ట్విస్టులను తలపించాయి. ఎన్నికల తంత్రమే కాదు, ఎన్నికలూ యుద్దాన్నే తలపించ్ఝాయి.
ఎలివేషన్‌తో కూడుకున్న సీన్స్ మాదిరిగా పోలింగ్ జరిగింది. ఈ రెండు స్థానాలను కూటమి, వైకాపా ప్రతిష్టాత్మకంగా తీసుకుని, హోరాహోరీగా తలపడ్డాయి. పోలింగ్ సమయంలో ఎవరూ ఊహించని విధంగా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. పులివెందులను నిలబెట్టుకోవాలని వైసీపీ (YCP).. ఎలాగైనా జగన్ కంచుకోటను బద్దలు కొట్టాలని టీడీపీ (TDP) ప్రణాళికలు రచించాయి. పులివెందులలో మొత్తం 11 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, మారెడ్డి లతారెడ్డి (Mareddy Latha Reddy), హేమంత్ రెడ్డి (Hemanth Reddy) పైనే అందరి కళ్లు ఉన్నాయి. ఈ పార్టీల ప్రణాళికలు రేపు వెలువడే ఫలితాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.
రెండుచోట్ల రీపోలింగ్..
పులివెందుల, ఒంటిమిట్ట (Pulivendula, Vontimitta) జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల్లో భాగంగా భారీ బందోబస్తు, ఎన్నో గొడవలు, అరెస్టులు చోటుచేసుకోవడం గమనార్హం. ఎట్టకేలకు పలు ఉద్రిక్తల మధ్య పోలింగ్ ముగిసింది. కానీ పులివెందులలో రెండు చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో 3, 14 కేంద్రాల్లో రీపోలింగ్ కొనసాగుతోంది.
ఉదయం 7గంటలకు ప్రారంభమైన రీ పోలింగ్.. సాయంత్రం 5గంటల వరకు సాగనుంది. ఈ రెండు పోలింగ్ కేంద్రాల్లో దాదాపు వెయ్యి మంది ఓటర్లు ఉన్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) ఫిర్యాదుతో ఈసీ రీపోలింగ్ (Repolling) కి ఆదేశించింది. రేపు పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.
జగన్ సంచలన ఆరోపణలు..
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు మంగళవారం ఉప ఎన్నికల తీరుపై ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) సంచలన వ్యాఖ్యలు చేశారు. “రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనపడటం లేదు.. ప్రజాస్వామ్యం లేని పరిస్థితుల్లో ఉంది అనటానికి నిన్న జరిగిన ఎన్నికలే ఉదాహరణ.. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పార్టీకి సంబంధించిన ఏజెంట్లు లేకుండా ఎన్నికలు జరిపారు.. 15 బూతుల్లో కూడా వైసీపీ ఏజెంట్లు (YCP agents) లేరు.. బూత్ దగ్గరకు కూడా వెళ్లలేని పరిస్థితి. సాక్షాత్తూ పోలీసుల ప్రోద్బలంతో రిగ్గింగ్ చేశారు.. మన రాష్ట్రంలో తప్ప దేశంలో ఎక్కడా ఇలా ఉండదు.. ఏజెంట్లు లేకపోతే దొంగ ఓట్లు ఎవరు గుర్తిస్తారు.. వచ్చిన వారిని గుర్తించటం.. తనిఖీ చేయటం.. సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేయటం పోలింగ్ ఏజెంట్ (Polling Agent) బాధ్యత.. భాద్యతలు ఉంటాయి కాబట్టే ఏజెంట్లకు బూత్ లలో కూర్చునే హక్కు ఉంటుంది.. పోలింగ్ ఏజెంట్ బూత్ లోకి వెళ్లగానే ఫారం 12 తీసుకుని వెళ్ళి ప్రిసైడింగ్ అధికారికి ఇస్తారు.. మా ఏజెంట్ల దగ్గర నుంచి పోలీసులు, టీడీపీ వాళ్ళు లాక్కుని చింపివేశారు.. అసలు ఏజెంట్లు లేకుండా ఎన్నికలు జరగటం నేను చూడలేదు” అంటూ మండిపడ్డారు.
రీపోలింగ్ అనేది ఒక డ్రామా : అవినాశ్
రీపోలింగ్ ను తాము బహిష్కరిస్తున్నామని అవినాశ్ తెలిపారు. అన్ని పోలింగ్ బూత్ లలో అవకతవకలు జరిగిన విషయాన్ని నిన్న రాష్ట్ర ప్రజలందరూ చూశారని… కానీ రెండు బూత్ లలో మాత్రమే రీపోలింగ్ నిర్వహిస్తున్నారని విమర్శించారు. కంటితుడుపు చర్యగా రీపోలింగ్ నిర్వహిస్తున్నారని అన్నారు. పులివెందులలో సరికొత్త సంస్కృతిని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chief Minister Chandrababu) తీసుకొచ్చారని మండిపడ్డారు. కేంద్ర బలగాలతో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. రీపోలింగ్ అనేది ఒక డ్రామా అని విమర్శించారు. మొత్తం 15 బూత్ లలో దొంగ ఓట్లు వేశారని తెలిపారు. ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చిన టీడీపీ కార్యకర్తలు పోలింగ్ కేంద్రాల (Polling centers) వద్ద ఓటర్ల నుంచి స్లిప్ లు తీసుకుని వెళ్లి వాళ్లే ఓటు వేశారని ఆరోపించారు.
ఓడిపోతారనే బాయ్‌కాట్ డ్రామా : బీటెక్ రవి
రీపోలింగ్ కోరిన వైఎస్సార్సీపీ, ఇప్పుడు ఎన్నికల సంఘం ఆదేశించిన రెండు బూత్‌ల రీపోలింగ్‌ను బహిష్కరించడం (Expulsion) తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఓటమి భయంతోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా పారిపోతోందని తెలుగుదేశం పార్టీ నేత బీటెక్ రవి (BTech Ravi) తీవ్రస్థాయిలో విమర్శించారు. “మొదట 15 బూత్‌లలో రీపోలింగ్ జరపాలని డిమాండ్ చేసింది వైఎస్సార్సీపీ. ఇప్పుడు ఎన్నికల సంఘం రెండు బూత్‌లలో రీపోలింగ్‌కు ఆదేశిస్తే, దానిని బహిష్కరిస్తున్నామని వైఎస్ అవినాశ్ రెడ్డి ప్రకటించడం విడ్డూరంగా ఉంది. ప్రజాస్వామ్యంపైనా, ప్రజలపైనా నమ్మకం ఉంటే ఈ రెండు బూత్‌లలో రీపోలింగ్ ను ఎందుకు అంగీకరించడం లేదు? ప్రజలు మీకు ఓటు వేయరని, మీరు ఓడిపోతారని స్పష్టంగా తెలియడం వల్లే ఈ బాయ్‌కాట్ డ్రామా (Boycott drama) ఆడుతున్నారు” అని బీటెక్ రవి ఆరోపించారు. ఈ రెండు బూత్‌లలో ఎన్నికలు జరిగితే ఎలాగూ మళ్లీ రీపోలింగ్ రాదని, అలాంటప్పుడు పోటీ నుంచి ఎందుకు తప్పుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రజలు తమ వైపు లేరన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేక, వైఎస్సార్సీపీ ఈ విధంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆయన విమర్శించారు.
వైసీపీది “డైవర్షన్ పాలిటిక్స్”
ఇదే విషయంపై ఇతర టీడీపీ నేతలు మాట్లాడుతూ… ఇది వైఎస్సార్సీపీ ఆడుతున్న “డైవర్షన్ పాలిటిక్స్” అని ఆరోపించారు. పోలింగ్ రోజు సాయంత్రం ఫీడ్‌బ్యాక్ (Feedback) తీసుకున్న తర్వాత తమకు ఓట్లు పడలేదని నిర్ధారించుకుని, కావాలనే రీపోలింగ్ వివాదాన్ని తెరపైకి తెచ్చారని అన్నారు. ఇప్పుడు తమ ఓటమిని కప్పిపుచ్చుకోవడానికి ఎన్నికల సంఘం, పోలీసులు, టీడీపీపై నెపం మోపుతున్నారని, రేపు మీడియాపైనా ఆరోపణలు (Accusations) చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని ఎద్దేవా చేశారు. “గతంలో ఇక్కడ రాజారెడ్డి రాజ్యాంగం నడిచింది. కానీ ఇప్పుడు ప్రజలు ఆ పాలన వద్దు, అంబేద్కర్ రాజ్యాంగం కావాలని కోరుకుంటున్నారు. ఎన్డీయే కూటమి అభ్యర్థి లతారెడ్డికి ఓటు వేసి తమ అభిప్రాయాన్ని స్పష్టం చేస్తున్నారు” అని టీడీపీ నేతలు (TDP leaders) పేర్కొన్నారు. కాగా, వైఎస్సార్సీపీ బహిష్కరించినప్పటికీ, ఈసీ ఆదేశాల మేరకు రెండు బూత్‌లలో రీపోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.