హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు వరద ముంపుకు గురవుతున్నాయి. ఈ పరిస్థితిని స్వయంగా పరిశీలించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ఆకస్మికంగా క్షేత్ర స్థాయిలో పర్యటించారు.
అమీర్‌పేట్‌లోని బుద్ధనగర్, మైత్రివనం, బాల్కంపేట ప్రాంతాలను సీఎం సందర్శించారు. బుద్ధనగర్‌లో వరద నీరు ఇళ్లలోకి ప్రవేశించడం, డ్రెయిన్ సిస్టమ్ లోపాలు, డ్రైనేజీ కాలువ రహదారి కంటే ఎత్తులో ఉండటం వంటి సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
బుద్ధనగర్‌కు సమీపంలోని గంగూబాయి బస్తీకుంటను కూడా సీఎం పరిశీలించారు. బస్తీకుంట కొంతభాగాన్ని పూడ్చి పార్కింగ్‌గా వాడుతున్నారని స్థానికులు ఫిర్యాదు చేయడంతో, ముఖ్యమంత్రి ఆ ప్రదేశాన్ని మళ్లీ పునరుద్ధరించే దిశగా ఆదేశాలు ఇచ్చారు. వరద సమస్యకు శాశ్వత పరిష్కారంగా ప్రత్యేక ట్రంక్ లైన్ ఏర్పాటు చేయాలని, వెంటనే ప్రణాళికలు సిద్ధం చేయాలని జీహెచ్ఎంసీ, హైడ్రా కమిషనర్లకు ఆదేశించారు.
బాలుడికి సీఎం హామీ
అమీర్ పేట్ బుద్ధనగర్‌లో జశ్వంత్ అనే బాలుడితో ముఖ్యమంత్రి వివరాలు ఆరా తీశారు. బాలుడిని వెంట తీసుకుని ఆ ప్రాంతాన్ని కలియతిరిగారు. తాను 7 వ తరగతి చదువుతున్నానని, వరద నీరు ఇంట్లోకి వచ్చి పుస్తకాలు తడిసిపోయాయని ఆ బాలుడు ముఖ్యమంత్రికి వివరించారు. భవిష్యత్తులో వరద పరిస్థితులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తానని ముఖ్యమంత్రి బాలుడికి ధైర్యం చెప్పారు.
ఆదేశాలు జారీ
పర్యటన అనంతరం, జీహెచ్ఎంసీ కమిషనర్, హైడ్రా కమిషనర్ సహా సంబంధిత అధికారులకు వరద సమస్యల పరిష్కారం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.