హైదరాబాద్: ‘దసరా’ విజయానంతరం హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మళ్లీ కలిసి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. ఈసారి వారు ‘ది ప్యారడైజ్’ అనే విభిన్న కాన్సెప్ట్ కథతో రానున్నారు.
కాగా, ఎనౌన్స్ చేసినప్పటినుంచే ఈ సినిమా భారీ హైప్ సాధించింది. ఇక తాజాగా మూవీ నుంచి నాని ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో నాని పాత్ర పేరు ‘జడల్’ అని ప్రకటించారు. పోస్టర్‌లో ఆయన కొత్త లుక్‌లో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు.
ఇక దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సోషల్ మీడియా ద్వారా – “ఇక నుంచి ఈ సినిమాలోని ప్రతి పాత్రను రెండు పోస్టర్లతో పరిచయం చేస్తాం” అని తెలిపారు. చెప్పినట్లుగానే, ఉదయం ఒక పోస్టర్, సాయంత్రం మరొక పోస్టర్ విడుదల చేస్తూ నాని పాత్రను పరిచయం చేశారు మేకర్స్.
ఈ రెండు పోస్టర్లు నెట్టింట వైరల్ అవగా, “ఇలాంటి క్యారెక్టర్ చేయాలంటే గట్స్ ఉండాలి” అంటూ నాని ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ఈ భారీ ప్రాజెక్ట్ 2026 మార్చి 26న ప్రేక్షకులను పలకరించనుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీతో పాటు మొత్తం 8 భాషల్లో విడుదల కానుంది.