ఆంధ్ర‌ప్ర‌భ, వెబ్ డెస్క్ : ఒక్క తెలుగు రాష్ట్రాల్లో (Telugu states) నే కాక జాతీయ స్థాయి నాయకులూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలోకి రావడానికి ఎంచుకునే ఆయుధాల్లో పాదయాత్ర (padayatra) లు ముఖ్యమైనవి. అవి చాలామందికి అచ్చొచ్చాయి కూడా. పాదయాత్రల వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. అన్నివర్గాల ప్రజలతో మమేమకం కావచ్చు. సమస్యలు తెలుసుకోవచ్చు, అధికార పార్టీల వైఫల్యాలను అడుగడుగునా ఎండగట్టవచ్చు. ఎలాగూ మీడియా, లైవ్ కవరేజ్ ఉంటుంది కాబట్టి, ప్రతి అడుగూ, ప్రతి మాటా ప్రజల మనసులో బలంగా నాటుకు పోతుంది.

అయితే ఇక్కడ విశేషమేమంటే తెలంగాణ (Telangana)లో స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకొచ్చిన తెలంగాణ పార్టీ తెలంగాణ ప్ర‌భుత్వ పనితీరుపై ప్రజాస్పందన ఎలా ఉంది. ప్రజలు ప్రజా ప్రభుత్వ తీరుపై ఏ విధంగా స్పందిస్తున్నారు. ఇంకా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుందనే విషయాలపై ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవడం కోసం రాష్ట్ర కాంగ్రెస్ (Congress) జ‌న‌హిత యాత్ర ను ప్రారంభించింది.

ఈ యాత్ర‌పై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పాద‌యాత్ర చేయ‌డ‌మేమిట‌ని విప‌క్షాలు విమ‌ర్శ‌ల బాణాలు వ‌దులుతున్నాయి. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు (People’s problems) తీర్చ‌కుండా, స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు నిర్వ‌హించ‌కుండా కాల‌యాప‌న చేయ‌డానికి రోడ్డుపై తిరుగుతున్నార‌ని ఆరోప‌ణ‌లు (Accusations) వెల్లువెత్తుతున్నాయి.


ప్ర‌జ‌ల క‌ష్టాలు తెలుసుకోవ‌డానికే కాంగ్రెస్ పార్టీ జ‌న‌హిత పాద‌యాత్ర చేస్తుందా…?
పేద‌ల స‌మ‌స్య‌లు తీర్చ‌డానికే ప్ర‌జ‌ల్లోకి వెళ్తుందా..?
నిజంగా జ‌నానికి భ‌రోసా ఇవ్వ‌డానికే హ‌స్తం నాయ‌కులు జ‌నం బాట ప‌ట్టారా..?,
లేదా కాంగ్రెస్ పార్టీలో ఏమైనా లుక‌లుక‌లు ఉన్నాయా అనే అనుమ‌నాలు వ్య‌క్త‌మవుతున్నాయి.
ఎందుకంటే, ఈ జ‌న‌హిత యాత్ర‌లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) భాగం కావ‌డం లేదు.
ఈ యాత్ర కేవ‌లం ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, మంత్రులు శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, పరిగి ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో మాత్ర‌మే కొనసాగుతోంది. సీఎం రేవంత్ ఈ యాత్రలో భాగ‌స్వామ్యం కాక‌పోవ‌డంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

సీఎంను నెమ్మ‌దిగా ప‌క్క‌కు పెట్ట‌డానికీ, తమ వర్గం యొక్క ప్రాబల్యం పెంచుకోవడానికే ఈ పాద‌యాత్ర తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్య‌వ‌హారాల ఇన్‌చార్జి మీనాక్షీ న‌ట‌రాజ‌న్ ఆధ్వ‌ర్యంలో చేప‌డుతున్నారా..? అనే అనుమానాలు వ‌స్తున్నాయి.

అయితే సీఎం రేవంత్ రెడ్డి బీసీ రిజ‌ర్వేష‌న్ల (BC Reservations) పై ఢిల్లీలో చేప‌ట్టే ఆందోళ‌న‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌తో క‌లిసి పాల్గొంటున్న నేప‌థ్యంలోనే కాంగ్రెస్ జ‌న‌హిత పాద‌యాత్ర‌లో పాల్గొన‌డం లేద‌ని ఆ పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. నిజానిజాలు ఏమైనా.. కాంగ్రెస్ పార్టీ ఈ స‌మ‌యంలో చేప‌ట్టిన పాద‌యాత్ర పార్టీకి ప్ల‌స్సా.. మైన‌స్సా… అనేది భ‌విష్య‌త్‌లో జ‌రిగే ఎన్నిక‌లు నిర్ణ‌యిస్తాయి.

తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) రాష్ట్రంలో కొన్ని ఎంపిక చేసుకున్న నియోజకవర్గాల్లో పాదయాత్ర, శ్రమదానం పేరుతో పర్యటిస్తున్న సందర్భంగా రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. జూలై 31న రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District) ప్రారంభ‌మైన కాంగ్రెస్ జ‌న‌హిత యాత్ర నుంచి ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ లో నిర్వ‌హించే స‌మావేశంతో ముగియ‌నుంది. రంగాపూర్‌ నుంచి పరిగి వరకు ఏఐసీసీ ఇన్‌చార్జి (AICC in-charge) మీనాక్షి నటరాజన్‌, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌, మంత్రులు శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, పరిగి ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ యాత్ర ర్యాలీగానే కొనసాగింద‌ని విప‌క్షాలు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి.. ‘ఈ ప్రాంతం అభివృద్ధికి ఏమేమీ కావాలి, సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయి, ఇంకా ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలి’ అని నేతలు అడిగి తెలుసుకుంటారని ఈ ప్రాంతవాసులందరూ ఆశించారు.

తీరా చూస్తే ఇలా వచ్చి, అలా వెళ్లిపోయారని పలువురు పెదవి విరిచారు. “దారి పొడవునా ఏ ఒక్క సామాన్యుడినీ కలిసింది లేదు, మాట్లాడిందీ లేదు” అని ఆరోపిస్తున్నారు. నాయ‌కుల‌ను కలిసేందుకు ప్రయత్నించినా వారిని సైతం పోలీసులు లాగి పక్కకు తోసేయడం విడ్డూరంగా ఉంద‌ని విప‌క్ష నాయ‌కులు అంటున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు (Telangana High Court) కీలక తీర్పు వెలువరించింది. 2025, సెప్టెంబర్ 30 లోపు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. అయితే రాష్ర్ట ప్ర‌భుత్వం ఆ దిశ‌గా ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటున్న దాఖ‌లాలు లేవు. ఎందుకు కాల‌యాప‌న చేస్తుందో ఎవ‌రికీ అర్థం కాని ప‌రిస్థితి నెల‌కొంది. కాంగ్రెస్ పార్టీకి స్థానిక ఎన్నిక‌ల్లో గెలుస్తామ‌నే న‌మ్మ‌కం లేదా అనే చ‌ర్చ సాగుతోంది. అసెంబ్లీ ఎన్నిక‌ల ముందు ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో అమ‌లు చేయ‌క‌ పోవ‌డంతో ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఏర్పడిందని కాంగ్రెస్ ప్ర‌భుత్వం (Congress government) గుర్తించే, స్థానిక ఎల‌క్ష‌న్స్ నిర్వ‌హించ‌డం లేద‌నే అనుమానాలు వ్య‌క్త‌మవుతున్నాయి. ప్ర‌జ‌ల నాడి తెలుసుకుందామ‌నే జ‌న‌హిత పాద‌యాత్ర చేప‌ట్టింద‌ని విప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి.

Leave a Reply